UttarPradesh: గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ సోదరుల హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ అనూహ్యరీతిలో హతమయ్యాడు. ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతీక్‌ అహ్మద్‌తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ మృతి చెందారు.

Updated : 16 Apr 2023 00:30 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiw Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ హత్యకు గురయ్యారు. జైలు నుంచి మెడికల్‌ చెకప్‌ కోసం తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అతీక్‌ అహ్మద్‌ సోదరుల హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ను పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్‌ చేశారు. అతడితో పాటు మరో నిందితుడు గుల్హామ్‌ను కూడా కాల్చి చంపారు. ఝాన్సీలో రాష్ట్ర స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన ఎన్‌కౌంటర్‌ (Encounter)లో వీరిద్దరు హతమయ్యారు. ఘటనాస్థలంలో అధునాతన విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చేసుకోగా.. తాజాగా అతీక్‌ ఆహ్మద్‌ హత్యకు గురవ్వడం గమనార్హం.

2005 నాటి బీఎస్పీ (BSP) శాసనసభ్యుడు రాజుపాల్‌ (Raju Pal) హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ ఫిబ్రవరి 24న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అంగరక్షకులను కూడా హంతకులు పట్టపగలే కాల్చి చంపడం యూపీలో సంచలనం సృష్టించింది. ఉమేశ్‌ పాల్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఉమేశ్ భార్య జయ పాల్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన  పోలీసులు మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు.

ఉమేశ్ పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) కుమారుడు అసద్‌ను  ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ హత్య తర్వాత నుంచి అసద్‌, అతీక్‌ అనుచరుడు గుల్హామ్‌ అదృశ్యమయ్యారు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. వీరిపై రూ.5లక్షల చొప్పున రివార్డులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఝాన్సీలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు (UP Police), నిందితుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకొంది. కాగా.. ఉమేశ్ పాల్‌ హత్య కేసులో ఓ షార్ప్‌ షూటర్‌, మరో నిందితుడిని కొన్నాళ్ల క్రితమే యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని