phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 27 May 2024 23:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారాసకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ‘‘అప్పటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టాం. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచాం. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టాం. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్‌ చేశాం. 

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టాం. జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచాం. కొందరు మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశాం. వాట్సప్‌, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించాం. ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించారు’’ అని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు..

మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022 అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్‌ భావించారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ఉన్నట్టు తెలిపారు. ఈ సమయంలోనే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భాజపా అగ్రనేతలు సంప్రదించినట్లు తెలిసింది. భాజపాకు చెక్‌ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్‌ పెట్టాలని కేసీఆర్‌ ఎస్‌ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకరరావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించినట్టు తెలిపారు. 

భాజపా అగ్రనేతల ఫోన్‌లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్టు రాధాకిషన్‌రావు చెప్పారు. అలా ట్యాప్‌ చేసిన ఒక ఆడియో టేప్‌ను కేసీఆర్‌కు పంపినట్టు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్‌ అందరినీ ట్రాప్‌ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను దిల్లీకి పంపామని, ట్రాప్‌ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్‌హౌస్‌లో అమర్చామని తెలిపారు. ఆపరేషన్‌ మొత్తం బాధ్యతను సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి భాజపా అగ్రనేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్‌ ఆదేశించినట్టు చెప్పారు. బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేస్తే దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరపుదామని అనుకున్నట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వివరించారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్ల సంతోష్‌ను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సంతోష్‌ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు రాధాకిషన్‌రావు వివరించారు. కేసీఆర్‌తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని