crime News: తాగడానికి అంగీకరించలేదని.. డాబాపై నుంచి కిందకు తోసేసి..!

మద్యం తాగలేదని ఓ వ్యక్తిని డాబాపై నుంచి కిందకు విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Updated : 28 May 2024 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమతోపాటు మద్యం తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు డాబాపై నుంచి కిందకు విసిరేసిన ఘటన లఖ్‌నవూలో చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. స్థానిక రుప్పుర్‌ ఖద్రా అనే ప్రదేశంలో రంజిత్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు. ఈ మొత్తం గొడవ సమీపంలోని ఓ సెక్యూరిటీ  కెమెరాలో రికార్డైంది. 

బాధితుడు రంజిత్‌ సింగ్‌ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు మద్యానికి తీవ్రంగా బానిసయ్యారు. వారు అతడి దుకాణానికి తరచూ వచ్చేవాళ్లు. శుక్రవారం రాత్రి బలవంతంగా అతడి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం తమతో కలిసి రంజిత్‌ కూడా మద్యం తాగాలని పట్టుబట్టారు. కానీ, అందుకు నిరాకరించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరాడు. దీంతో వారు వెళ్లిపోయారు. కానీ, మర్నాడు మరోసారి ఇంట్లోకి చొరబడి డాబాపైకి తీసుకెళ్లి అతడిపై దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో ఇది శ్రుతి మించి రంజిత్‌ను ఒక వ్యక్తి డాబాపై నుంచి కిందకు విసిరేశాడు. దీంతో అతడు రోడ్డుపై పడ్డాడు. మిగిలిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. స్థానికులు అతడిని రక్షించి వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసినట్లు లఖ్‌నవూ పోలీసులు ప్రకటించారు. సురేందర్‌ కుమార్‌, హేమంత్‌ కుమార్‌, అమర్‌ గౌతమ్‌ అనే నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు