Viral Video: అమానవీయం.. ‘వీలునామా’ కోసం చనిపోయిన మహిళ నుంచి వేలిముద్రలు..!

చనిపోయిన వృద్ధురాలి నుంచి వేలిముద్రలు సేకరించి.. తప్పుడు వీలునామా సృష్టించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది.

Published : 12 Apr 2023 01:18 IST

దిల్లీ: ఆస్తి కోసం కుటుంబీకులు, బంధువులనే విషయాన్ని మరచి మానవత్వం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్న తీరు కలచివేస్తోంది. కొందరు డబ్బు కోసం ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రాణాలు పోయిన తర్వాత ఆస్తి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఓ వృద్ధురాలి వేలిముద్ర తీసుకుంటున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది. అయితే, తప్పుడు ‘వీలునామా’ కోసమే ఈ అమానవీయానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తునకు ఉపక్రమించారు. అయితే, ఇది 2021 నాటి ఘటన అని చెబుతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కమలా దేవీ.. మే 8, 2021లో ప్రాణాలు కోల్పోయారు. గతంలోనే భర్త మరణించగా.. ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. అయితే, అంత్యక్రియల కోసం భర్త తరఫు బంధువులు ఆమె మృతదేహాన్ని వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కారు కొద్ది దూరం వెళ్లగానే పక్కకు నిలిపివేశారు. ఓ న్యాయవాదిని పిలిపించి ఆమె నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. అనంతరం వాటితో ‘తప్పుడు వీలునామా’ సృష్టించి ఆమె ఆస్తులు, దుకాణాన్ని తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల దీనికి సంబంధించి 45సెకన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వెనకసీటులో ఉన్న ఓ వృద్ధురాలి (కమలాదేవీ) నుంచి ఓ వ్యక్తి వేలిముద్ర తీసుకుంటున్నట్లు అందులో కనిపించింది. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన ఓ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా కమలాదేవీ సంతకం పెడుతుందని.. వేలిముద్ర వేయదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆగ్రా పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని