Robbery: తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ

ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో దుండగులు పట్టపగలే రెచ్చిపోయారు. ఉద్యోగుల్ని బెదిరించి బ్యాంకు ఖజానా నుంచి రూ.18కోట్లకు పైగా నగదును ఎత్తుకెళ్లారు.

Updated : 01 Dec 2023 17:43 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో సినీ ఫక్కీలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఉఖ్రుల్‌ జిల్లా కేంద్రంలో దొంగలు  రెచ్చిపోయారు. ఓ ప్రభుత్వ బ్యాంకులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేసి బ్యాంకులో రూ.18.80కోట్ల డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం 10 మంది  గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి అధునాతన ఆయుధాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోకి ప్రవేశించారు. ఆర్‌బీఐ, ఏటీఎంలకు పంపేందుకు నగదును ఇక్కడే నిల్వ చేస్తుంటారు.

ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్‌కు 80కి.మీల దూరంలో ఉంటుంది. దీనిపై కన్నేసిన దుండగులు గురువారం సాయంత్రం బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరింపులకు గురిచేశారు. వారందరినీ వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి బంధించారు. వీరిలో సీనియర్‌ ఉద్యోగిని తుపాకీతో బెదిరించి ఖజానాను బలవంతంగా తెరిపించారు. అందులో ఉన్న ఖజానాను దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకొనేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు