JEE Advanced: హైదరాబాద్‌లో మాస్‌ కాపీయింగ్‌.. వాట్సాప్‌ ద్వారా జేఈఈ సమాధానాలు

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది.

Updated : 06 Jun 2023 18:19 IST

హైదరాబాద్‌: ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు.  సికింద్రాబాద్‌ మార్కెట్‌, నాచారం, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరి పీఎస్‌లలో మాస్‌ కాపీయింగ్‌పై కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌ ఎస్వీఐటీ, నాచారం, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరిలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్లలో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు గుర్తించారు.

పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదుగురు విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా సమాధానాలు చేరవేసుకున్నారు. నాచారం అయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో ఓ విద్యార్థి వద్ద మొబైల్‌ గుర్తించిన ఇన్విజిలేటర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఐదుగురు విద్యార్థులతో కలిసి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. వెంటనే మిగతా విద్యార్థులు ఉన్న సెంటర్లను పోలీసులు అప్రమత్తం చేశారు. ఐదుగురు విద్యార్థులను పరీక్షా కేంద్రాల నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. 

దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరైవుంటారని అంచనా. ఈసారి కటాఫ్‌ మార్కులు సుమారు 60గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని