Fire Accident: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం... 27 మంది మృతి

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

Updated : 26 May 2024 00:03 IST

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో (Rajkot) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులంతా తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి.. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని