జీ-20 సమావేశం ‘సీక్రెట్ ఫైళ్లు’ పాకిస్థాన్‌కు.. ఆర్థిక శాఖ ఉద్యోగి నిర్వాకం

జీ-20 సమావేశానికి (G20 Meeting) సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేశాడో వ్యక్తి. కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఈ గూఢచర్యానికి పాల్పడ్డాడు.

Updated : 12 Jul 2023 00:06 IST

గాజియాబాద్‌: విదేశాంగ శాఖ (Ministry of External Affairs)లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గూఢచర్యాని (espionage)కి పాల్పడ్డాడు. భారత్‌లో జరుగుతున్న జీ-20 సమావేశానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేశాడు. అతడి నిర్వాకంపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గాజియాబాద్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నవీన్‌ పాల్‌ అనే వ్యక్తి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ వాట్సాప్‌లో చాటింగ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నవీన్‌ పాల్‌.. ఆ యువతికి దేశ భద్రతకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పంపించాడు. జీ-20 సమావేశానికి(G20 Meeting) సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను నిందితుడు ఆ మహిళకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఫైళ్లను నవీన్‌ తన ఫోన్లో ‘సీక్రెట్‌’ అని సేవ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నవీన్‌ కార్యకలాపాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గాజియాబాద్‌ పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. తొలుత ఆ మహిళ ఫోన్‌ నంబరు.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినదిగా గుర్తించారు. ఆ తర్వాత ఐపీ అడ్రస్‌తో ట్రేస్‌ చేయగా.. ఆ నంబరు కరాచీ నుంచి పనిచేస్తున్నట్లుగా తేలింది. అంతేగాక, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఓ మహిళ.. నవీన్‌ ఖాతాకు కొంత డబ్బు జమ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ మహిళా ఎవరా?అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు డబ్బు కోసమే ఈ పని చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని