Noida: ఫ్యాషన్‌ షోలో విషాదం.. ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా మీదపడిన పిల్లర్‌

Nodia: ఫ్యాషన్ షోలో అమర్చిన లైటింగ్‌ స్తంభం ఓ మోడల్‌ పాలిట మృత్యువుగా మారింది. ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా ఆ పిల్లర్‌ మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

Published : 12 Jun 2023 11:04 IST

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో (Fashion Show) ఈవెంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ లైట్లను అమర్చిన ఇనుప స్తంభం (లైటింగ్‌ ట్రస్‌) మీదపడింది. ఈ ఘటనలో ఓ మోడల్‌ (Model) అక్కడికక్కడే మృతిచెందింది.

నోయిడా ఫిల్మ్‌ సిటీ (Noida Film City)లోని లక్ష్మీ స్టూడియోల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫ్యాషన్‌ షో కోసం ర్యాంప్‌వాక్‌ పక్కన అమర్చిన లైట్ల స్తంభం ఒక్కసారిగా ర్యాంప్‌పై పడిపోయింది. అదే సమయంలో 24 ఏళ్ల వన్షికా చోప్రా (Vanshika Chopra) అక్కడ నడుస్తుండగా ఆ స్తంభం ఆమె మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన వన్షికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీ రాజ్‌ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫ్యాషన్‌ షోకు అనుమతి లేకపోయినా నిర్వాహకులు ఈవెంట్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని