Road accident: కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి.. భర్తపై మృతురాలి తల్లిదండ్రుల అనుమానం

కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది.

Updated : 29 May 2024 10:11 IST

ఆసుపత్రి వద్ద బాధిత బంధువుల ఆందోళన

ప్రవీణ్‌తో కుమారి, చిన్నారులు కృషిక, తనిష్క

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక(4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రఘునాథపాలెం ఎస్‌ఐ సురేశ్, సిబ్బంది సందర్శించి విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి హరిసింగ్‌   ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశారు. సంఘటన విషయం తెలిసి కుమారి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కుమారి, పిల్లల మృతిపై వారు అనుమానం వ్యక్తం చేశారు.

వివాహేతర సంబంధమే కారణం! 

ప్రవీణ్‌ హైదరాబాదులో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తె కుమారితో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి హరిసింగ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వారికి ఇద్దరు కుమార్తెలేనని, కుమారుడు పుట్టలేదని ప్రవీణ్‌ అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిపై ఏడాదిగా దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్‌ 20 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. పది రోజుల క్రితం కుమారి, తన పిల్లలతో హైదరాబాద్‌ నుంచి బాబోజితండాకు వచ్చారు. 25న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ తెమ్మన్నా ప్రవీణ్‌ తేలేదని హరిసింగ్‌ తెలిపారు. ఈ క్రమంలో వారు చనిపోవడం, కుమారి, పిల్లల శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే అతన్ని ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు. 

మంత్రి తుమ్మల విచారం

రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై మండల నాయకులు, గ్రామస్థులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని