Courier Scam: కొరియర్‌ పేరిట రూ.కోట్లు కొల్లగొట్టేస్తారు..

సాధారణ ప్రజలు పోలీసు కేసులు, అరెస్టు వారెంట్లు ఎదుర్కోవాలంటే సహజంగానే భయపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కొరియర్‌ మోసాలకు పాల్పడుతున్నారు.

Updated : 30 May 2024 07:02 IST

నిషేధిత వస్తువులు తరలిస్తున్నారని సైబర్‌ మోసగాళ్ల ఫోన్లు 
అధికారుల పేరిట వీడియో కాల్‌ చేసి వేధింపులు
కేసులనగానే భయపడి డబ్బులు బదిలీ చేస్తున్న బాధితులు 

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణ ప్రజలు పోలీసు కేసులు, అరెస్టు వారెంట్లు ఎదుర్కోవాలంటే సహజంగానే భయపడతారు. దీన్నే ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కొరియర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. అవతలి వ్యక్తికి ఆలోచించే సమయం ఇవ్వకుండా తీవ్ర భయాందోళనలకు గురి చేసి డబ్బులు తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారు. విచిత్రంగా ఈ తరహా మోసాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ధనికులే ఎక్కువగా బాధితులవుతున్నారు. మత్తుమందులు, ఆయుధాల కేసులు అనే సరికి కంగారు పడుతున్నారు. తాజాగా నల్లధనం పేరిట నేరగాళ్లు కొత్త దందాకు కూడా తెరలేపారు. 

ఇదీ తీరు.. 

  • దుండగుడు ముందుగా బాధితుల ప్రాథమిక వివరాలు సేకరించి.. ఫోన్‌ చేస్తాడు.
  • పేరు పెట్టి పిలిచి, ఫలానా కొరియర్‌ ద్వారా మీరు విదేశాలకు పంపుతున్న పార్సిల్‌లో మత్తుమందులు, పాస్‌పోర్టులు, పిస్టల్, బుల్లెట్లు ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారని, సీబీఐ లేదా క్రైం బ్రాంచి పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పి పెట్టేస్తాడు. 
  • కాసేపటికే మరో నంబరు నుంచి వీడియో కాల్‌ వస్తుంది. తాను ముంబయి సీబీఐ అధికారినని, కొరియర్‌లో నిషేధ వస్తువులపై కస్టమ్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో మీపై కేసు నమోదు చేశామని చెబుతాడు. విచారణకు ముంబయి రావాలని, లేకపోతే తామే వచ్చి అరెస్టు చేస్తామని బెదిరిస్తాడు. జైలుకు వెళ్లక తప్పదని, బెయిల్‌ కూడా రాదని బెంబేలెత్తిస్తాడు. 
  • బాధితులు తాము కొరియర్‌ ఏదీ పంపలేదంటే.. మీ పేరు, చిరునామా ఉన్నాయంటూ వివరాలు చదువుతాడు.  
  • దీంతో తమ పేరు మీద ఇంకెవరైనా పంపారేమోనని ఆలోచిస్తుండగానే.. మరో వీడియోకాల్‌ వస్తుంది. తాము కస్టమ్స్‌ నుంచి మాట్లాడుతున్నామని మళ్లీ అదే కథ చెబుతాడు. 
  • చివరకు తమను ఏదోవిధంగా ఈ కేసు నుంచి బయటపడేయమని బాధితులు ప్రాధేయపడే వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. 
  • ఇక అప్పటి నుంచి బేరం మొదలుపెడతాడు. ఇది చాలా పెద్ద కేసు అని, సీబీఐ, కస్టమ్స్‌ దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి ఖర్చు కూడా భారీగానే ఉంటుందని అంటాడు. 
  • తరువాత అవతలి వ్యక్తి మోసం గ్రహించే వరకు విడతల వారీగా ఇచ్చిన కాడికి డబ్బులు గుంజుతూనే ఉంటాడు. ఇలా హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సంస్థలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ రూ.45 లక్షలు చెల్లించారు.

రూటు మార్చిన కేటుగాళ్లు..

కొరియర్‌ మోసాలపై జనంలో కాస్త అవగాహన పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో దోపిడీ మొదలెట్టారు. ముందు ఫోన్‌ చేసి ‘మీరు మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్నారని, మీ ఖాతాలో నల్లధనం జమైనట్లు గుర్తించామ’ని కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు చెబుతాడు. ఇంకా బాగా నమ్మించేందుకు తాజాగా జరుగుతున్న ఏదైనా సంచలనాత్మక కేసును పేర్కొంటాడు. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద అరెస్టయిన ప్రముఖ వ్యక్తి పేరు చెప్పి.. ఆయన ఖాతాల నుంచి మీ ఖాతాల్లోకి డబ్బు జమైందంటాడు. అసలు ఆయన ఎవరో తమకు తెలియదని బాధితులు మొత్తుకున్నా వినడు. తరువాత పోలీసు వేషధారణలో వీడియో కాల్‌ చేసి.. మీ ఖాతా వివరాలు చెబితే అందులో జమైన డబ్బు వివరాలు పరిశీలించి నల్లధనం పడిందో లేదో నిర్ధారిస్తామంటాడు. లేకపోతే కేసు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరిస్తాడు. వారికి వివరాలు చెప్పేంత వరకు ఎక్కడికీ వెళ్లనివ్వడు. ఒకవేళ బాత్‌రూంకు వెళ్లాలన్నా కాల్‌ కట్‌ చేయకుండా బాత్‌రూం తలుపు వైపు ఫోన్‌ పెట్టి వెళ్లమంటాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక బాధితులు తమ బ్యాంకు ఖాతా వివరాలు చెబుతారు. ఆ వెంటనే ఖాతా ఖాళీ అవుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ నుంచి ఇలానే రూ.99 లక్షలు వసూలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మరో యువతి కూడా రూ.60 లక్షలు పోగొట్టుకుంది. అయితే ఆ వెంటనే అనుమానం వచ్చి 1930కి ఫోన్‌ చేయగా.. ఆ డబ్బు నేరగాడి ఖాతాలో జమ కాకుండా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నిలువరించగలిగారు.


విచారణలు వీడియో కాల్‌లో జరగవు 

- శిఖా గోయల్, డైరెక్టర్, రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

రోజూ కొరియర్‌ మోసాలకు సంబంధించి మాకు 20 నుంచి 30 కాల్స్‌ వస్తుంటాయి. కొరియర్‌లో మత్తుమందులు పంపుతున్నారన్న అభియోగంతో మొదలయ్యే వ్యవహారం నకిలీ దర్యాప్తు సంస్థల ప్రవేశంతో పరాకాష్ఠకు చేరుతుంది. ఈడీ, సీబీఐ, కస్టమ్స్, ముంబయి క్రైం బ్రాంచి వంటి ప్రముఖ సంస్థల పేర్లు ఎడాపెడా వాడుకుంటూ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ బెదిరింపులకు దిగుతున్నారు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్‌ ద్వారా అనుమానితులను విచారించదని గుర్తుంచుకోవాలి. అన్నింటికీ మించి మీరు ఎలాంటి పార్సిల్‌ పంపలేదని.. మీ ఖాతాలో ఎలాంటి డబ్బు జమ కాలేదని తెలిసినప్పుడు ఎవరు ఫోన్‌ చేసినా భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ డబ్బు బదిలీ చేయవద్దు. బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పొద్దు. ఒకవేళ మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.  

  • గతేడాది జూన్‌లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఇప్పటి వరకు వచ్చిన ఈ తరహా కేసులు నమోదైనవి: 1197
  •  బాధితులు నష్టపోయిన మొత్తం రూ. 35,55,97,110
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని