NIA: ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

Published : 22 May 2024 04:11 IST

అనంతపురంలో ఒకరి అరెస్టు, తెలంగాణలో అదుపులోకి మరొకరు
రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తు 

ఈనాడు, హైదరాబాద్, రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఎన్‌ఐఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 1న జరిగిన రామేశ్వరం కెఫే పేలుడులో పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సూత్రధారులుగా భావిస్తున్న ముస్సవిర్‌ హుస్సేన్‌ షాజీబ్, అబ్దుల్‌ మతీన్‌ తాహాలను కోల్‌కతాలో గత ఏప్రిల్‌ 12న ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వారిని విచారించినప్పుడు వెల్లడైన అంశాల ఆధారంగా పేలుడుకు సహకరించిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితులకు మరో 11 మంది సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

అనంతపురం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌: అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సోహైల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఏడు గంటల పాటు విచారించి బెంగళూరుకు తరలించారు. రాయదుర్గం వేణుగోపాలస్వామి వీధిలో నివాసముంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌కు సోహైల్, మథిన్‌ అనే ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సోహైల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఏడాదిగా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. గతంలో సోహైల్‌ బెంగళూరులోని ఓ పీజీ గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉండేవాడు. రెండు నెలల కిందట రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా సోహైల్‌ స్నేహితుడిని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. అతడితో కలిసి సోహైల్‌ హైదరాబాద్‌కు వెళ్లేవాడని వారికి తెలిసింది. బాంబు పేలుడు ఘటన నిందితుడితో పలుమార్లు వాట్సప్‌లో మాట్లాడటం, చాటింగ్‌ చేయటం వంటివి గుర్తించిన అధికారులు సోహైల్‌ కదలికలపై నిఘా ఉంచారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా రాయదుర్గంలోని తన ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోనూ వికారాబాద్‌ జిల్లా పూడురుకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2012లో వెలుగుచూసిన బెంగళూరు కుట్ర కేసులో శిక్షపడ్డ హైదరాబాద్‌కు చెందిన ఒబేద్‌ ఉర్‌ రెహమాన్‌ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని