Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అదనపు ఎస్పీల పాత్రపై దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు దర్యాప్తు బృందం కస్టడీలో విచారిస్తోంది.

Published : 30 Mar 2024 14:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. వీరి స్టేట్‌మెంట్‌ కీలకంగా మారడంతో పాటు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు శుక్రవారం అరెస్టు అయిన టాస్క్‌పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అదనపు ఎస్పీల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో భుజంగరావు, తిరుపతన్న చేసిన వ్యవహరంపై ఆరా తీస్తున్నారు. వీరంతా పలువురు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు.. సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారని సమాచారం. దీంతో పాటు గత శాసనసభ ఎన్నికల్లో ఓ  ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఎస్‌ఐబీ బృందాన్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ధ్వంసం చేయడంతో ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని