Crime News: రావులపాలెంలో దారుణం.. ఫొటోషూట్‌ అని పిలిచి చంపేశారు!

ఓ యువ ఫొటోగ్రాఫర్‌ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఇది జరిగింది.

Updated : 03 Mar 2024 16:04 IST

మధురవాడ: ఓ యువ ఫొటోగ్రాఫర్‌ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖలోని పీఎం పాలెం పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌(23) పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు చిత్రీకరణ చేస్తుంటాడు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని స్థానిక ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు కూడా ఈవెంట్‌లకు వెళ్తుంటాడు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పది రోజుల ఫొటోషూట్‌ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయికుమార్‌ను పిలిచారు. దీంతో తన వద్దనున్న సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రితో అతడు బయలుదేరి వెళ్లాడు. వెళ్లే ముందు పెళ్లి వేడుకలో ఫొటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. 

సాయికుమార్‌ విశాఖలో రైలు ఎక్కి రాజమహేంద్రవరంలో దిగగా.. ఇద్దరు యువకులు కారులో వచ్చి తీసుకెళ్లారు. రావులపాలెం సమీపంలో ఇద్దరు వ్యక్తులు అతడిని హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రిని తీసుకెళ్లారు. మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆలమూరు వద్ద మృతదేహం గుర్తించాం: ఎస్పీ

హత్య కేసుపై విశాఖ సీపీ రవిశంకర్‌  స్పందించారు. ‘‘సాయి అదృశ్యమయ్యాడని గత నెల 29న ఫిర్యాదు అందింది. రూ.10లక్షల విలువైన కెమెరా కోసమే అతడిని హత్య చేశారు. ఆలమూరు వద్ద మృతదేహం గుర్తించాం. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం’’ అని ఎస్పీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని