Shraddha Walkar Murder: ఆఫ్తాబ్‌ను తరలిస్తున్న వాహనంపై దాడికి యత్నం!

శ్రద్ధా వాకర్‌ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు దాడి చేసేందుకు యత్నించిన వారిని అరెస్టు చేశారు. 

Published : 28 Nov 2022 20:39 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌పై కొందరు దాడికి యత్నించారు. దిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోరెన్సిక్‌ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్‌ను ల్యాబ్‌ నుంచి జైలుకు తీసుకెళ్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీస్‌ వ్యాన్‌పై దాడి చేశారు. పోలీస్‌ వ్యాన్‌ తలుపులు తెరిచి ఆఫ్తాబ్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దాదాపు 15 మంది వ్యక్తులు కత్తులతో శ్రద్ధాకు న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ ఆఫ్తాబ్‌ ఉన్న వ్యాన్‌పై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా సోమవారం ఆఫ్తాబ్‌కు అధికారులు మరోసారి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు. ఇప్పటికే అధికారులు శ్రద్ధావిగా భావిస్తున్న పలు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం వాటిని ల్యాబ్‌కు పంపారు. మరోవైపు శ్రద్ధాను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌, ఆమె ఉంగరాన్ని మరో యువతికి బహుమతిగా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.  హత్య తర్వాత ఆఫ్తాబ్‌ ముంబయి వెళ్లి ఆమెతో బ్రేకప్‌ అయినట్లు శ్రద్ధా స్నేహితులకు కట్టుకథలు చెప్పడంతోపాటు, శ్రద్ధా ఫోన్‌ను ఆమె మిత్రులతో ఛాటింగ్ చేసేందుకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు