Cheating: ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!

బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు.. వారి వివాహాల కోసం కొందరు.. పెన్షన్‌లా ఉపయోగపడుతుందని మరికొందరు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు ఫైనాన్స్‌ సంస్థలో పొదుపు చేశారు.

Updated : 21 May 2024 07:09 IST

టెస్కాబ్‌ జీఎం వాణీబాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్‌ సంస్థలో డిపాజిట్లు
బాధితుల్లో సహోద్యోగులు, సిబ్బంది 

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ వద్ద బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌- నారాయణగూడ, న్యూస్‌టుడే: బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు.. వారి వివాహాల కోసం కొందరు.. పెన్షన్‌లా ఉపయోగపడుతుందని మరికొందరు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు ఫైనాన్స్‌ సంస్థలో పొదుపు చేశారు. అధిక వడ్డీ ఇస్తామన్న నిర్వాహకుల మాటలు నమ్మి నిలువునా మోసపోయారు. 537 మంది నుంచి రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించిన ఆ సంస్థ తాజాగా బిచాణా ఎత్తేసింది. దీంతో న్యాయం చేయాలంటూ బాధితులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుని భార్య.. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్‌ (టెస్కాబ్‌)లో జీఎం కాగా, ఆమె మాటలు నమ్మి సహోద్యోగులు, అధికారులు భారీగా ఆ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయారు. ఈ క్రమంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 

 వాణీబాల ఇంటికి అంటించిన సస్పెన్షన్‌ ఉత్తర్వులు

నమ్మకంగా ముంచేశారు

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ (64), ఆయన కుమారుడు శ్రీహర్ష (32) హైదరాబాద్‌ అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్‌ సిస్టమ్, ఫైనాన్స్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని పెద్దఎత్తున డబ్బు సేకరించారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల (60) టెస్కాబ్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్లు చేస్తే 15-18 శాతం వడ్డీ ఇస్తారంటూ తన సహోద్యోగులు, తమ బ్యాంకు ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులు, టెస్కాబ్‌లో డిపాజిట్‌ చేయడానికి వచ్చేవారిని వాణీబాల నమ్మించేవారు. ఇలా గత కొన్నేళ్లలో చాలామంది టెస్కాబ్‌ అధికారులు, వివిధ జిల్లాల డీసీసీబీల సిబ్బంది ఈ కంపెనీలో రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా అందరికీ వడ్డీలు సక్రమంగా చెల్లిస్తుండడంతో మూడు రాష్ట్రాల్లో సుమారు 537 మంది ఈ కంపెనీలో రూ.200 కోట్లు డిపాజిట్‌ చేశారు. 

అజ్ఞాతంలోకి వెళ్లి.. ఐపీ పెట్టారు!

గతేడాది నవంబరు, డిసెంబరు నుంచి డిపాజిట్‌దారులకు వడ్డీల చెల్లింపుల్లో నిర్వాహకులు జాప్యం చేయటం ప్రారంభించారు. కొందరు తమ డిపాజిట్‌లు తిరిగి చెల్లించాలని జనవరి, ఫిబ్రవరిలో ఒత్తిడి తీసుకురాగా.. ఏప్రిల్‌ కల్లా పాతబకాయిలు చెల్లిస్తామని వారికి నచ్చజెప్పి వెనక్కి పంపారు. అనంతరం నేతాజీ, శ్రీహర్ష, వాణీబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.. మోసపోయామని బాధితులు గుర్తించారు. ఈ క్రమంలో వాణీబాల కుటుంబం కోర్టును ఆశ్రయించి ఐపీ పెట్టినట్లు తెలిసిందని వాపోతున్నారు. బాధితులు జ్యోతి దిట్టకవి, నిశిత, గౌతమ్, పి.మల్లికార్జునశర్మ, వెంకటేశ్వరాచారి, రాధాకృష్ణశర్మ, ఎం.శ్రీనివాసమూర్తి తదితరులు సోమవారం సీసీఎస్‌ ఎదుట ఆందోళన నిర్వహించి, ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి కొంక రామారావు (81) రూ.6 లక్షలు డిపాజిట్‌ చేద్దామని టెస్కాబ్‌కు వెళితే.. అక్కడ వాణీబాల సూచనతో శ్రీప్రియాంక ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్‌ చేశారని.. ఇటీవలే ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, మందులకు కూడా డబ్బులు లేవంటూ బాధపడుతున్నారని శ్రీనివాసమూర్తి తెలిపారు. చాలామంది తమ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కుతుందనే భయంతో ఆ ఫైనాన్స్‌ కంపెనీపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని తెలిసింది.

వాణీబాలపై విచారణకు టెస్కాబ్‌ ఆదేశం

ఈ ఘటనల నేపథ్యంలో టెస్కాబ్‌ జనరల్‌ మేనేజర్‌ నిమ్మగడ్డ వాణీబాలను సస్పెండ్‌ చేస్తూ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు  టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ తెలిపారు. ఈ నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయా భత్యాల చెల్లింపు నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. అమె అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్, విచారణ ఉత్తర్వులను హైదరాబాద్‌ న్యూసైదాబాద్‌ కాలనీలోని ఆమె ఇంటికి సిబ్బంది అంటించారు. 

 టెస్కాబ్‌లో పెన్షన్‌ లేదని, ఈ వడ్డీ ద్వారా జీవనం గడుస్తుందని వాణీబాల మాటలు నమ్మి తాము సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్‌ కంపెనీలో పెట్టి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు