Death Mystery: రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు

మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్‌ మిస్టరీని ఛేదించారు.

Updated : 29 Mar 2024 15:47 IST

ముంబయి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించాడో దొంగ. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి అరెస్టయ్యాడు. ఆ తర్వాత దొంగ వద్ద లభించిన ఫోన్‌ ఆధారంగా ఓ మర్డర్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జాహిద్‌ జైదీ అనే వ్యక్తి రైలులో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి అతడి ఫోన్‌ను తస్కరించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై.. పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డు చేశాడు. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు.  వీడియో వైరలవ్వడంతో స్పందించిన కల్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఇటీవల చోటుచేసుకున్న మృతి ఘటనకు అసలు కారణం తెలిసింది.

‘‘నిందితుడిని అరెస్టు చేశాం. అతడిని ఠానేకు చెందిన జాదవ్‌గా గుర్తించాం. అతడి వద్ద స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్న మొబైల్ ఫోన్‌ను ఆన్ చేయగా.. అది పుణెకు చెందిన ప్రభాస్ భాంగేదిగా  గుర్తించాం. బ్యాంకు ఉద్యోగి అయిన ఆయన హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్‌లోని తన నివాసానికి వచ్చాడు. అనంతరం మార్చి 25 అర్ధరాత్రి పుణెకు తిరిగి వెళ్తుండగా విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి పడి మృతి చెందాడు. అప్పటి నుంచి అతడి మరణానికి కారణాలు తెలియరాలేదు. అతడి ఫోన్‌ను జాదవే దొంగలించాడు. దానిని తిరిగి లాక్కోవడానికి చేసిన ప్రయత్నంలో భాంగే కదులుతున్న రైలులోంచి కిందపడి మరణించాడు’’ అని పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని