Crime: ఆర్జేడీ నేత ఇంటి బయట కాల్పులు..వెంటాడి దారుణ హత్య

Eenadu icon
By Crime News Team Published : 21 Aug 2024 11:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హాజీపూర్: బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్జేడీకి చెందిన కౌన్సిలర్ పంకజ్ రాయ్ మంగళవారం సాయంత్రం హాజీపూర్‌లోని తన నివాస సమీపంలోని దుస్తుల దుకాణం వద్ద కూర్చున్నారు. అక్కడికి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆయన అప్రమత్తమై పరిగెత్తుతూ ఇంట్లోకి వెళ్లారు. అయినా వదలకుండా దుండగులు వెంటాడి ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. కుటుంబసభ్యులు పంకజ్ రాయ్‌ను ఆసుపత్రికి తరలించేలోగా ఆయన మరణించారు.

ఈ విషయంపై ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విఫలమయ్యారని మండిపడ్డారు. ‘‘నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ గూండాలు రాత్రి వేళ హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్ రాయ్‌ను కాల్చి చంపారు. వారి గూండాలు అల్లకల్లోలం సృష్టిస్తుంటే సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు.’’ అని దుయ్యబట్టారు. 

పంకజ్ రాయ్ ఆరు నెలల ముందే ఓ వివాదం కేసులో ప్రాణభయం ఉందని పోలీసులను సంప్రదించారని, అయినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు