Neal Katyal: ట్రంప్‌ టారిఫ్‌లకు ‘నీల్‌’ చెక్‌ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్‌..?

Eenadu icon
By International News Team Published : 04 Nov 2025 12:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన న్యాయవిచారణకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం (Trump Trade War) సాగిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారాలను నిర్ణయించే అంశంపై న్యాయస్థానం బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) విచారణ జరపనుంది. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ నీల్‌ కత్యాల్‌ (Neal Katyal) వాదనలు వినిపించనున్నారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో మార్మోగుతోంది. ఇంతకీ ఎవరాయన?

54 ఏళ్ల నీల్‌ కత్యాల్‌ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్‌ నుంచి వచ్చిన వలసదారులు. యేల్‌ లా స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నీల్‌.. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో యూఎస్‌ సొలిసిటర్‌ జనరల్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించారు.

ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ..

గతంలో పలుమార్లు ట్రంప్‌ (Donald Trump) విధానాలకు వ్యతిరేకంగా నీల్‌ న్యాయస్థానాల్లో వాదించిన సందర్భాలున్నాయి. 2017లో ట్రంప్‌ తొలిసారి అధికారంలో కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసులను నీల్‌ వాదించారు. ‘ఇంపీచ్‌: ది కేస్‌ అగైనెస్ట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. తాజాగా ట్రంప్‌ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్‌ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

రెండోసారి అధికారంలోకి రాగానే ట్రంప్‌ మిత్ర, శత్రు భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాలతో (Trump Tariffs) విరుచుకుపడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని ఉపయోగించి ట్రంప్‌ ఈ సుంకాలు విధించారని అమెరికా సర్కారు తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని వినియోగించే క్రమంలో అధ్యక్షుడు ఫెడరల్‌ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్‌ నిర్ణయాన్ని కొన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.

విచారణకు ట్రంప్‌ దూరం..

ఈ కేసు విచారణకు ట్రంప్‌ ప్రత్యక్షంగా హాజరుకావాలని తొలుత భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రభుత్వం తరఫున ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ హాజరుకానున్నారు. ఈ కేసు విచారణపై ట్రంప్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఇందులో మేం గెలిస్తే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, సురక్షితమైన దేశంగా అమెరికా నిలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే పేద దేశంగా మారుతుంది. అలా జరగొద్దని భగవంతున్ని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు