Road Accident: ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 18 May 2024 12:04 IST

గుత్తి: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్‌ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులను అల్లీ సాహెబ్‌ (58), షేక్‌ సురోజ్‌బాషా(28) మహ్మద్‌ అయాన్‌(6), అమాన్‌(4), రెహనాబేగం(40)గా గుర్తించారు. షేక్‌ సురోజ్‌ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని