Wanaparthy: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు.  

Updated : 04 Mar 2024 07:57 IST

కొత్తకోట: వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు బుస్రా (2), మరియా (5), వాసిర్‌ రవుత్‌ (7 నెలలు) ఉన్నారు.

గాయపడిన వారిలో సమీరా (5), హుస్సేన్‌ (10), షఫీ, ఖదీరున్నీసా, హబీబ్, అలీ, షాజహాన్ బేగ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో అలీకి వనపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటుందని.. డైవర్ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఘటన జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎల్ అండ్ టీ సిబ్బంది గంటకుపైగా శ్రమించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని