Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.

Updated : 27 May 2024 11:42 IST

చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.  తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య,  ఆయన భార్య జయంతి, వారి బంధువు పద్మమ్మతోపాటు కారు డ్రైవర్ సమీర్ మృతి చెందారు.

కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటుచేసుకున్న మరో ఘటనలో నలుగురు మృతి చెందారు. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వెళ్తున్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను స్వామినాథన్ (35), రాకేశ్‌ (12), రాధా ప్రియా (14), గోపి(31)గా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరొకరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరో ఘటనలో కారు దగ్ధం..

చంద్రగిరి మండల పరిధిలోని సి.మల్లవరం జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ఇద్దరు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి చంద్రగిరి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

చంద్రబాబు దిగ్భ్రాంతి..

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు