Road accidents: అతివేగం.. రహదారులు రక్తసిక్తం

రాష్ట్రంలో జాతీయ రహదారులు రక్తమోడాయి. అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Updated : 28 May 2024 05:41 IST

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

కృష్ణాజిల్లా కోడూరుపాడు వద్ద జరిగిన ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. చెల్లాచెదురైన మృతదేహాలు

హనుమాన్‌జంక్షన్, చంద్రగిరి, న్యూస్‌టుడే : రాష్ట్రంలో జాతీయ రహదారులు రక్తమోడాయి. అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్‌ జిల్లా కుద్దంకు చెందిన కొండమనైకర్‌ సామినాథన్‌(43) కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అడ్వకేట్‌ కాలనీలో నివసిస్తోంది. తమిళనాడు వెళ్లేందుకు తెల్లవారుజామున సామినాథన్, ఆయన భార్య సత్య, కుమార్తె రథిప్రియ(14), కుమారుడు రాకేష్‌(12), సామినాథన్‌ అన్న కుమారుడు గోపినాథ్‌ కనివేల్‌(32) కారులో బయలుదేరారు. వీరి కారు ఉదయం 6.40 గంటల సమయంలో కోడూరుపాడు వద్ద హైవే వంతెన దిగి పెట్రోల్‌ బంకును దాటింది. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో అదే లారీ కారును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు దూసుకుపోయింది. అదే సమయంలో అటు వైపు మార్గంలో మంగళగిరి నుంచి విశాఖపట్నం వెళుతున్న శీతల పానీయాల ట్రాలీని ఢీకొట్టింది. సామినాథన్‌ భార్య సత్య మినహా అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు ఇంజిన్‌ భాగం ఊడిపోయింది. తీవ్రంగా గాయపడిన సత్యను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను చిలకలూరిపేటలో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి మండలంలో జరిగిన ప్రమాదంలో మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి కారులో ఆదివారం అర్ధరాత్రి బయలుదేరారు. ఎం.కొంగరవారిపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొంది. అందులో వాహనం ఇరుక్కుపోయి నుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో శేషయ్య (46), ఆయన భార్య జయంతి(38), అత్త పద్మమ్మ (55)తోపాటు కారు డ్రైవరు షమీర్‌ (30) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న శేషయ్య తమ్ముడు శ్రీనివాసులు, అతడి భార్య నీరజ తీవ్రగాయాలకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కారును, అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్‌ సాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. 

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొన్న కారు

దగ్ధమైన కారు: ఇదే జాతీయ రహదారిలో సి.మల్లవరం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. అదుపుతప్పి  కల్వర్టుపైకి దూసుకెళ్లడంతో కారులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న తిరుపతి గ్రామీణ మండలం ఉప్పరపల్లికి చెందిన చరణ్, కల్యాణ్‌ గాయాలతో బయటపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు