ఫోన్ ట్యాపింగ్ కేసు.. భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

Updated : 28 May 2024 15:15 IST

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగరావు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘భారాసకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్‌ చేశాం. భాజపా, కాంగ్రెస్‌లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం. భారాసలో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్‌ చేశాం. ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశాం. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేశాం’’ అని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

‘‘విపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలు ట్రాక్‌ చేశాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్‌ చేశాం. మూడు ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్‌ చేశాం. మునుగోడులో భాజపా, కాంగ్రెస్‌ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్‌ చేశాం. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్‌ చేపట్టాం. మళ్లీ భారాసను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. భారాస నేతల సూచనలతో పలు సెటిల్‌మెంట్లు చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలు సెటిల్‌ చేశాం. రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి భారీగా డబ్బు తరలించాం. భారాస నేతల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో డబ్బు తీసుకెళ్లాం’’

‘‘రియల్టర్‌ సంధ్యా శ్రీధర్‌రావు ఎలక్ట్రోరల్‌ బాండ్లు కొనేలా చేశాం. మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించాం. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వెంకటరమణారెడ్డి, రేవంత్‌ సోదరుడు కొండల్‌ రెడ్డిపై నిఘా పెట్టాం. పేపర్‌ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించిన వారి ఫోన్లు ట్యాప్‌ చేశాం’’ అని భుజంగరావు చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని