Crime News: ఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం సముద్రంలో లభ్యమైంది.

Published : 25 May 2024 06:07 IST

అదృశ్యమైన 5 రోజులకు సముద్రంలో మృతదేహం లభ్యం

అరవింద్‌

షాద్‌నగర్, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం సముద్రంలో లభ్యమైంది. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన దివంగత భాజపా నాయకుడు అరటి కృష్ణ, ఉషారాణి దంపతుల కుమారుడు అరవింద్‌(30) ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి సిడ్నీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితమే కేశంపేట మండలం చింతకొండపల్లికి చెందిన సిరివెన్నెలతో వివాహమైంది. కుమారుడి వద్దకు రెండు నెలల క్రితం వెళ్లిన తల్లి ఉషారాణి సోమవారమే స్వదేశానికి తిరిగివచ్చారు. అదే రోజున అరవింద్‌ అదృశ్యమయ్యారు. దీనిపై భార్య అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అరవింద్‌ మృతదేహాన్ని పోలీసులు సముద్రంలో కనుగొన్నారు. ఇది ప్రమాదమా, హత్యా, ఆత్మహత్యా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 2006లో భర్త దూరం కాగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు కన్నుమూయడంతో ఉషారాణి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు స్థానిక భాజపా నేత పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి సహకారంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని