MP Prabhakarreddy: సంచలనం కోసమే ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి: సీపీ శ్వేత

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ మీడియాకు వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు .. ఎంపీపై దాడి చేశారని తెలిపారు.

Updated : 01 Nov 2023 19:51 IST

సిద్దిపేట: మెదక్‌ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ మీడియాకు వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు .. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. నిందితుడు రాజు పలు వెబ్‌ఛాన్సల్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. విలేఖరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడు.

వీటికి సంబంధించి రాజుపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఎంపీపై దాడి సమయంలో భారాస కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రాజును తొగుట సీఐ కమలాకర్‌ అదుపులోకి తీసుకుని విచారించారు. ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలనే కత్తితో దాడి చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. గన్‌మెన్‌ ప్రభాకర్‌ నుంచి కత్తి, పాస్టర్‌ అంజయ్య వద్ద నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకున్నాం. కేసు విచారణలో భాగంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. సోషల్ మీడియాలో ఎవరూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు’’ అని సీపీ సూచించారు.

ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలవరం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్‌ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా.. ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు(38) ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చినట్లు వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు. ఎంపీ వెంట ఉన్న గన్‌మెన్‌ ప్రభాకర్‌ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేసుకోగా.. చుట్టూ ఉన్న భారాస నాయకులు, కార్యకర్తలు అతన్ని కొట్టారు. ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేశారు. వారి సూచనల మేరకు ప్రభాకర్‌రెడ్డిని సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని, పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోద వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం ప్రభాకర్‌రెడ్డి యశోద ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని