AFTC: ట్రైనీ క్యాడెట్‌ మృతి.. ఆరుగురు ఏయిర్‌ఫోర్స్‌ అధికారులపై హత్యాకేసు!

ఓ భారత వాయుసేన(IAF) ట్రైనీ క్యాడెట్‌ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై హత్యాకేసు నమోదైంది. బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీ(AFTC)లో ఈ ఘటన చోటుచేసుకుంది...

Published : 26 Sep 2022 02:09 IST

బెంగళూరు: ఓ భారత వాయుసేన(IAF) ట్రైనీ క్యాడెట్‌ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై హత్యాకేసు నమోదైంది. బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీ(AFTC)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఎఫ్‌టీసీ క్యాంపస్‌లోని ఓ గదిలో అంకిత్ ఝా(27) అనే ట్రైనీ క్యాడెట్‌ ఇటీవల ఉరేసుకుని కనిపించాడు. అతనిపై అప్పటికే కోర్టు విచారణ సాగుతోందని, దీంతో శిక్షణ నుంచీ తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే.. నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు శనివారం స్థానిక ఠాణాలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనలో ఏఎఫ్‌టీసీ అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మృతుడి సోదరుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. తన సోదరుడికి కాలేజీ క్యాంపస్‌లో నిత్యం వేధింపులు, చిత్రహింసలు ఎదురయ్యాయని ఆరోపించారు. దీనిపై ఓ సీనియర్‌ పోలీసు అధికారి స్పందిస్తూ.. ‘ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఓ వార్తాసంస్థకు తెలిపారు. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. కేసు విచారణలో అన్ని విధాలుగా సహకరిస్తామని వాయుసేన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని