షార్ట్‌సర్క్యూట్‌.. ఒకే కుటుంబంలో ఆరుగురి సజీవదహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశినగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లితో సహా ఐదుగురు పిల్లలు సజీవదహనమయ్యారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని పోలీసులు తెలిపారు.

Published : 15 Jun 2023 17:52 IST

కుశినగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి తల్లితోపాటు ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలంతా పదేళ్ల లోపువారే. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. ఉర్ధా ప్రాంతంలో సంగీత (38) తన పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆమె భర్త, అత్తమామలు ఇంటిబయట నిద్రిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. క్షణాల్లోనే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంతలో.. లోపల ఉన్న వారి అరుపులు విన్న భర్త, అత్తమామలు స్థానికులతో కలిసి వారిని కాపాడే ప్రయత్నం చేసినా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయారు. ఈలోగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు. మృతులను సంగీత, బాబు(1), గీత(2), రీత(3), లక్ష్మిణ(9), అంకిత్‌(10)గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితకుటుంబాన్ని అన్నిరకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.24 లక్షల ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని