Khammam: మరో రెండు నెలల్లో అమెరికాకు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నారు. వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 28 May 2024 16:43 IST

వైరా: మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దావులూరి వర్షిత (24) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. తిరువూరు మండలం ఎరుకుపాడు గ్రామానికి చెందిన యువకుడితో ఈ ఏడాది ఫిబ్రవరి 14న వర్షిత వివాహం జరిగింది. పెళ్లైన నాలుగు రోజులకే భర్త ఉన్నత చదువు నిమిత్తం అమెరికా వెళ్లారు. వర్షిత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమార్తెను ఈనెల 26న తండ్రి ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన వర్షిత.. తెల్లవారుజామున కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా.. ఇంటి ఆవరణలోని బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి కిరణ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు... 

కిరణ్ కుమార్, ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె వర్షిత మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే భర్త అమెరికాలో ఉండటం, తాను కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కావడంతో వీసా ఏర్పాట్లు చేసుకున్నారు. జులైలో అమెరికా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని భర్తతోపాటు తల్లిదండ్రులు, అత్తమామలకు తెలిపింది. ఈ క్రమంలో వర్షిత మృత్యువాత పడటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని