NIA: రాయదుర్గంలో ‘ఉగ్ర’ కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోయేల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

Published : 21 May 2024 19:10 IST

రాయదుర్గం పట్ణణం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోయేల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందింది. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ గఫూర్‌కు ఇద్దరు కుమారులు. బెంగళూరులో నివాసముంటున్న వారిలో ఒకరైన సోయేల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో మూడు రోజులుగా రెక్కీ నిర్వహించారు. 

ఎవరికీ అనుమానం రాకుండా మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు వచ్చి గఫూర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సాయుధ దళాల సాయంతో సాయేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య బెంగళూరు తరలించారు. సోయేల్‌ను అరెస్టు చేసినట్టు కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రం అందజేసినట్టు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి. ఫోన్‌ ద్వారా సోయేల్‌ ఉగ్రవాదులతో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని