కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు, గుండెపోటుతో డ్రైవర్‌ మృతి!

మహారాష్ట్రలో రద్దీగా ఉన్న కూడలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Published : 04 Jun 2024 00:05 IST

కొల్హాపుర్: మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఓ కారు బీభత్సం (Kolhapur Accident) సృష్టించింది. అత్యంత వేగంతో పలు వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారు నడుపుతోన్న వ్యక్తికీ స్వల్ప గాయాలు కాగా.. అతడు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రద్దీగా ఉన్న కూడలిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం కొల్హాపుర్‌లోని సైబర్‌ చౌక్‌లో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. అంతలోనే అత్యంత వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి.. నాలుగు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందుకెళ్లి మరో వాహనాన్నీ ఢీకొని బోల్తా పడింది. కారు వేగం ధాటికి బైక్‌లపై ఉన్న ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

వాటర్‌ట్యాంక్‌లో మృతదేహం.. ఆందోళనలో ప్రజలు

కారు నడుపుతోన్న వసంత్‌ చవాన్‌ (72) కూడా ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటన తర్వాత గుండెపోటు వల్లే ఆయన మృతిచెందినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని