Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం

ఎడ్లపందేలకు అనుమతివ్వలేదని కొన్ని అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. జాతీయ రహదారిపైకి చేరుకొని వాహనాలపై రాళ్ల వర్షం కురిపించాయి.

Published : 03 Feb 2023 02:25 IST

చెన్నై:  ఎడ్ల పందేల (Bull Race) నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వలేదని కోపోద్రిక్తులైన అల్లరి మూకలు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రాళ్ల వర్షం (Stones attack) కురిపించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి.  తమిళనాడులోని కృష్ణజిగి-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ జిల్లాలో ఎడ్ల పందేలను నిర్వహిస్తుంటారు. అయితే, ఈ సారి అధికారులు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. దీంతో కొన్ని అల్లరి మూకలు జాతీయ రహదారిపై హల్‌చల్‌ చేశాయి. వచ్చిన వాహనాలన్నింటినీ నిలిపేసి..రాళ్లదాడికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టే లాఠీఛార్జి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి జలఫిరంగులు ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఎడ్ల పందేల నిర్వహణపై  రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, జిల్లా కలెక్టర్‌ నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు కార్యక్రమానికి అనుమతించలేమని జిల్లా ఎస్పీ సరోజ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. తాజా ఘటనలో కొందరు గాయపడ్డారని, కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పిన ఆయన.. ఈ ఘటనకు కారణమైన వారి కోసం వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

పండగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ‘యెరుతు విదుమ్‌ విళా’ పేరుతో ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కృష్ణగిరిలో ఉదయం 10 గంటల తర్వాత ఎడ్ల పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా అధికారి ఒకరు చెప్పారు. అయితే, నిర్వాహకులు మాత్రం ఉదయం నుంచే కార్యక్రమం ప్రారంభించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని