Pune car crash: తాగి ఉన్నా.. మర్చిపోయా!: పుణె కారు ప్రమాద నిందితుడి సమాధానం

పుణె కారు ప్రమాద ఘటన (Pune car crash)లో దర్యాప్తు సిబ్బంది ప్రధాన నిందితుడిని ప్రశ్నించగా.. తనకేమీ గుర్తుకు రావడం లేదని చెప్పినట్లు సమాచారం. 

Updated : 03 Jun 2024 10:33 IST

ముంబయి: దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పుణె కారు ప్రమాద ఘటన (Pune car crash)లో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడిని పోలీసులు విచారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి అసలు ఏమైందో అతడు గుర్తుకు తెచ్చుకోలేకపోయినట్లు సమాచారం.

ఆ టీనేజర్ ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. తాను మద్యం మత్తులో ఉండటంలో ఆరోజు ఏం జరిగిందో తనకు గుర్తు రావడంలేదని అతడు చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్‌ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. తొలుత వెళ్లిన బార్‌లో నిందితుడు కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. అక్కడి నుంచి మరో బార్‌కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి వెళ్తుండగా ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టేందుకు అనుమతినివ్వాలని పోలీసులు ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరారు.

ఇదిలా ఉంటే.. బ్లడ్ టెస్ట్‌లో మద్యం ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకు అతడి తల్లి రక్త నమూనాలు ఇచ్చినట్లు కూడా వెల్లడైంది. ఆమెతో పాటు కేసు విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బాలుడి తాత, రియల్టర్‌ అయిన తండ్రిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మూడు కేసులు నమోదు కాగా.. 100 మంది సిబ్బందితో కూడిన బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని