VIzag: కాంబోడియా ముఠా కబంధ హస్తాల నుంచి విశాఖ యువతకు విముక్తి

మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు.. సైబర్‌ క్రైమ్‌ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చారని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు.

Published : 24 May 2024 21:59 IST

విశాఖపట్నం: మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు.. సైబర్‌ క్రైమ్‌ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చారని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తెలిపారు. వివిధ రకాల స్కామ్స్‌ చేయించి విశాఖ నుంచే దాదాపు రూ.120 కోట్లు కొల్లగొట్టారని వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన పది మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్‌ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరుకున్నారని సీపీ తెలిపారు. 

‘‘స్థానికంగా ఉన్న కొందరు ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారు. మన రాష్ట్రంలోని దాదాపు 150 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.50లక్షలు తీసుకుని కాంబోడియా ఏజెంట్లకు అప్పగించారు. గత ఆరు నెలలుగా వారంతా కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారు. విశాఖ సిటీ పోలీసులు తీసుకున్న చర్యల వల్ల వారిలో ధైర్యం వచ్చింది. బాధితులంతా అక్కడి చైనా అధికారుల ముందు నిరసన వ్యక్తం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ విషయం ఇండియన్‌ ఎంబసీ దృష్టికి వెళ్లడం, విశాఖ సిటీ పోలీస్‌ విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడటం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 10 మంది వచ్చారు. తరువాత ఫ్లైట్‌లో 18 మంది వస్తున్నారు. కాంబోడియా ముఠా నుంచి తప్పించుకున్న ఓ యువకుడు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి వ్యవహారం వెలుగు చూసింది. బాధితులంతా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటాం’’ అని సీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని