LIC నుంచి ₹2 కోట్లు కొట్టేసేందుకు ‘చావు’ తెలివి.. అక్కడే తప్పులో కాలేశారు!

LIC policy: ఎల్‌ఐసీని రూ.2కోట్ల మేర మోసగించేందుకు ముంబయిలో ఓ ముఠా యత్నించింది. అందుకోసం పక్కాగా ప్రణాళిక రూపొందించుకుంది. ఆ విషయంలో చేసిన చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది.

Published : 09 Mar 2023 15:28 IST

ముంబయి: బీమా డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి మనం వినే ఉంటాం. ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలూ చూశాం. చనిపోయారని నమ్మించి బీమా కంపెనీలను మోసగించడం ఓ తరహా మోసమైతే.. అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ముంబయిలో మొదటి తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.2 కోట్ల మేర ఎల్‌ఐసీని మోసగించేందుకు యత్నించిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ మొత్తానికి పాలసీ తీసుకోవడం మొదలు.. దాన్ని క్లెయిమ్‌ చేయడం వరకు ఎక్కడా అనుమానం రాకుండా స్కెచ్‌ వేసినప్పటికీ.. ఆ ఒక్క విషయంలో పొరపాటు వీరిని కటకటాల పాల్జేసింది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన దినేశ్‌ టక్సలే (29) ఎల్‌ఐసీ ఏజెంట్‌ ద్వారా ఎల్‌ఐసీ పాలసీ (LIC Policy) తీసుకున్నాడు. రూ.5 కోట్లు, రూ.3 కోట్లు విలువైన పాలసీల కోసం దరఖాస్తు చేశాడు. ఇందుకోసం నకిలీ ఆదాయ ధ్రువ పత్రాలను సృష్టించాడు. ఏటా తనకు వ్యవసాయంపై రూ.38 లక్షలు, మెస్‌ నడపడం ద్వారా మరో రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నాడు. దీంతో 2015 జులై 5న దరఖాస్తును ఆమోదించిన ఎల్‌ఐసీ.. రూ.2 కోట్ల మొత్తానికి 35 ఏళ్లకు గానూ పాలసీ జారీ చేసింది. ఇందుకోసం తొలి ప్రీమియంగా రూ.1.46 లక్షలు దినేశ్‌ చెల్లించాడు.

2017 మార్చి 14న దినేశ్‌ తల్లిగా పేర్కొంటూ నందా భాయ్‌ టక్సలే అనే మహిళ ఎల్‌ఐసీ దాదార్‌ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. తన కుమారుడు 2016 డిసెంబర్‌ 25న రోడ్డు ప్రమాదంలో మరణించాడని క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన ఎల్‌ఐసీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాలసీ కోసం సమర్పించిన డాక్యుమెంట్లు సహా మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా అనుమానస్పదంగా ఉండడంతో 2023 ఫిబ్రవరి 21న ఎల్‌ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దినేశ్‌ను పట్టుకున్నారు. ఈ మోసంలో అతడికి సహకరించిన అతడి ఇద్దరి స్నేహితుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు.

దాచుకున్న డబ్బులన్నీ ప్రీమియంకే

ఇంజినీరింగ్‌ డిప్లోమా పూర్తి చేసిన దినేశ్‌.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తక్కువ ఆదాయం వస్తుండడంతో ఏదైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే ఎల్‌ఐసీని మోసం చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం తన ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాడు. తొలుత రూ.8 కోట్ల బీమా కోసం ప్రయత్నించాడు. రూ.2కోట్లకే బీమా ఇవ్వడంతో తను దాచుకున్న రూ.5 లక్షలను ప్రీమియం రూపంలో చెల్లించారు. ఇందుకోసం నకిలీ ఆదాయ ధ్రువపత్రాలను సృష్టించారు.

పక్కా ప్లాన్‌.. అక్కడే దొరికేశారు!

తీరా దినేశ్‌ పేరిట పాలసీ దొరికాక.. దాదాపు ఏడాది పాటు వారు సైలెంట్‌గా ఉన్నారు. ఏడాది తర్వాత ఓ గుర్తుతెలీని శవం కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు 2016 డిసెంబర్‌లో ఓ శవాన్ని సంపాదించారు. అహ్మద్‌నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లి ఆ మృతదేహం తన కుమారుడు దినేశ్‌దేనంటూ వృద్ధ దంపతులు వైద్యులకు చెప్పారు. దీంతో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. వారు దాన్ని తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించారు. దినేశ్‌ పేరిట మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించాక ఎల్‌ఐసీని ఆశ్రయించారు. అయితే డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ.. తక్కువ టైమ్‌లో పాలసీ క్లెయిమ్‌కు రావడంతో ఎల్‌ఐసీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దినేశ్‌ బతికే ఉన్నాడని తెలీడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు. అయితే, ఆస్పత్రిలో వీరికి సహకరించింది ఎవరు? ఆస్పత్రి వద్దకు వెళ్లిన ఆ వృద్ధ జంట ఎవరు? ఇంతకీ ఆ మరణించిన వ్యక్తి ఎవరు? ఈ వ్యవహారంతో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని