Phone Tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌.. దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated : 28 May 2024 19:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ భుజంగరావు ఆదేశాలతోనే తాను దాడులకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తిరుపతన్న పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఆయన చెప్పిన వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన మూడు ఉపఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుపతన్న బృందం కీలకంగా పనిచేసింది.

‘‘భారాస పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. కాంగ్రెస్‌, భాజపా పార్టీలకు డబ్బు చేరకుండా అడ్డుకట్ట వేశాం. దీని కోసం ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. POL-2023 పేరుతో ప్రత్యేక ఎన్నికల వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రణీత్‌ కుమార్‌ ఇచ్చిన సమాచారంతోనే 15 ఆపరేషన్లు, మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, భాజపా సానుభూతిపరుల డబ్బులను సీజ్‌ చేశాం.

ప్రస్తుత మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌ కుమార్‌లకు చెందిన డబ్బులను స్వాధీనం చేసుకున్నాం. రాఘవ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన రూ.10.5 కోట్లు, ఎమ్మెల్యే వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన రూ.50.45 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నాం. కామారెడ్డి ఉపఎన్నిక కోసం ప్రత్యేక బృందాన్ని నియమించుకున్నాం. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు భాజపా నేత వెంకటరమణారెడ్డిపై  నిఘా పెట్టాం. మొత్తం 300 మంది సెల్‌ఫోన్‌లను ట్యాప్‌ చేశాం. తద్వారా సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాం. కొల్లూరులో రేవంత్‌రెడ్డి మిత్రుడు గాలి అనిల్‌కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్‌రెడ్డి దగ్గర రూ.1.99 కోట్లు,  రాజగోపాల్‌రెడ్డి అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు, ఉత్తమ్ సహచరుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ. 90 లక్షలు స్వాధీనం చేసుకున్నాం’’ అని తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు