Jail: అత్యధిక కాలం జైలు శిక్ష పడిన నేరస్థులు!

కొన్ని దేశాల్లో దోషులు చేసిన ప్రతి నేరానికి శిక్షను లెక్కగట్టి వందేళ్లు.. రెండు వందల ఏళ్లు జైలుశిక్ష విధించడమూ ఉంది. అలా కోర్టు తీర్పులతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన నేరగాళ్లు ఎవరు?

Published : 14 Nov 2021 01:27 IST

నేరాలకు పాల్పడినవాళ్లకు జైలు శిక్ష తప్పదు. వాళ్లు ఎలాంటి నేరం చేశారనేదానిపైనే శిక్ష ఎన్నాళ్లు విధిస్తారనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనదేశంలో తీవ్రమైన కేసుల్లో కోర్టులు ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంటాయి. అయితే, వివిధ దేశాల్లో దోషులపై కోర్టులు విధించే జైలు శిక్షలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో దోషులు చేసిన ప్రతి నేరానికి శిక్షను లెక్కగట్టి వందేళ్లు.. రెండు వందల ఏళ్లు జైలుశిక్ష విధించడమూ ఉంది. అలా కోర్టు తీర్పులతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన నేరగాళ్లు ఎవరు? ఏ నేరానికి ఎంతకాలం జైలు శిక్ష పడిందో తెలుసుకుందాం..!

ఆర్థిక మోసం - 1,41,078ఏళ్లు

థాయ్‌లాండ్‌కు చెందిన చమో తప్యాసో ప్రపంచంలోనే అత్యధికంగా జైలుశిక్ష పడిన నేరస్థురాలిగా చరిత్రలో నిలిచింది. ఆమెకు 1989 జులై 27న ఆ దేశ కోర్టు 1,41,078 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 1940లో జన్మించిన చమో పెట్రోలియం అథారిటీ ఆఫ్‌ థాయ్‌లాండ్‌లో ఉద్యోగం చేసేది. ఆమెకున్న పరిచయాలు.. పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి 1960లో చిట్‌ఫండ్‌ వ్యాపారం మొదలుపెట్టింది. ఆ తర్వాత పిరమిడ్‌ స్కీమ్‌ను ప్రారంభించి.. ఇందులో చేరి, మరికొందరిని చేర్పిస్తే డబ్బులు వస్తాయని ప్రకటించింది. ఇదో చైన్‌ బిజినెస్‌. ఈ స్కీమ్‌తో 16వేల మంది నుంచి దాదాపు రూ.15వేల కోట్లకు పైగా మోసం చేసిందట. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తేల్చి శిక్ష ఖరారు చేసింది. అయితే.. అదే సమయంలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఆర్థిక నేరాల్లో శిక్షపై ఒక చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి కేసుల్లో దోషులకు ఎంత కాలం జైలు శిక్ష విధించినా.. అత్యధికంగా 20ఏళ్లు మాత్రమే అనుభవించాలని పేర్కొంది.


ఉగ్రదాడి - 40వేల ఏళ్లకు పైగా..

2004 మార్చి 11న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఓ రైల్వేస్టేషన్‌పై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 193 మంది ప్రాణాలు కోల్పోగా.. 2వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. స్పెయిన్‌ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన దాడిగా చెప్పుకుంటారు. ఈ కేసు విచారణలో మొత్తం 28 మంది దోషులుగా తేలారు. వారిలో ప్రధాన దోషులైన కొయ్‌ డాన్‌కి 42,924 ఏళ్లు.. జమాల్‌ జౌగమ్‌కు 42,922 ఏళ్లు, ఎమిలియో సురెజ్‌ ట్రషోరస్‌కు 34,715 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే స్పెయిన్‌ చట్టాల ప్రకారం ఏ నేరస్థుడైనా.. అత్యధికంగా 40 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.


బాలికపై అత్యాచారం - 30వేల ఏళ్లు

అమెరికాకు చెందిన చార్లెస్‌ స్కాట్‌ రాబిన్సన్‌ మూడేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం సహా పలు నేరాలకు పాల్పడ్డాడు. 1994లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు చార్లెస్‌ను దోషిగా తేల్చింది. ఆరు సెక్షన్లకు 5వేల ఏళ్ల చొప్పున 30వేల ఏళ్ల జైలు శిక్ష విధించింది.


అత్యాచారం.. దోపిడీలు - 20వేల ఏళ్లకుపైగా!

అమెరికాకు చెందిన అలన్‌ వేన్‌ మెక్‌లూరిన్‌, డార్రోన్‌ బెనల్‌ఫోర్డ్‌ అండర్సన్‌ కలిసి అత్యాచారం సహా దోపిడీలు, కిడ్నాప్‌ వంటి అనేక నేరాలు చేశారు. వీరిద్దరిపై విచారణ జరిపిన అక్కడి కోర్టు అలన్‌ వేన్‌ మెక్‌ లూరిన్‌కు 29,750 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డార్రోన్‌కు 2,500 ఏళ్లు కారాగార శిక్ష వేసింది. అయితే, డార్రోన్‌ తనకు విధించిన శిక్షపై పునఃసమీక్ష కోరాడు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ గతంలో విధించిన 2,500 ఏళ్లతోపాటు అదనంగా మరో 9,500ఏళ్లు కలిపి.. 11,750ఏళ్లు శిక్ష విధించింది. ఆ తర్వాత 500 ఏళ్లు తగ్గించడంతో మొత్తంగా డార్రోన్‌కు 11,250ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది.


సామాన్యులపై కాల్పులు - 7వేల ఏళ్లు

అమెరికాలోనే 2012లో సౌత్‌వెస్ట్‌ హూస్టన్‌ నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అతడికి 7వేల ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 2013లోనూ డల్లాస్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిపి ముగ్గురి మృతికి కారణమైన దోషికి అక్కడి కోర్టు 7వేల ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.


ఊచకోత - 6వేల ఏళ్లు 

గ్వాటెమాల చరిత్రలో 1982 డిసెంబర్‌ 6 మరచిపోలేని రోజు. ప్రభుత్వం తీసుకొచ్చిన స్కోర్చ్‌డ్‌ ఎర్త్‌ పాలసీలో భాగంగా సైన్యం డాస్‌ ఎర్రెస్‌ గ్రామంలో దాదాపు 200 మందిని ఊచకోత కోసింది. ఈ ఘటనకు సంబంధించి సైన్యంలోని ఐదుగురిపై కేసు నమోదైంది. సుదీర్ఘ కాలం కోర్టులో విచారణ కొనసాగింది. ఎట్టకేలకు 2011లో ఆ సామూహిక హత్యలో పాల్గొన్న ఐదుగురు మాజీ సైనికులు కార్లోస్‌ ఆంటానియో కారియస్‌ లోపెజ్‌, డానియల్‌ మార్టినెజ్‌, రేయెస్‌ కొలిన్‌ గాలిప్‌, మాన్యూవల్‌ పోప్‌, పెడ్రో పెమెంటల్‌ రియోస్‌కు 6వేల ఏళ్ల చొప్పున అక్కడి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.


1978 నుంచి 1990 మధ్య 26 హత్యలు.. 166 హత్యాయత్నాల కేసులో స్పెయిన్‌కు చెందిన హెన్రీ పారట్‌కు 1990లో 4,797 ఏళ్లు, 1986 జులై 14న మాడ్రిడ్‌లో కార్‌ బాంబుతో 12 మంది మృతికి కారణమైన డెల్‌ రియో ప్రడాకు 1989లో 3,828 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికాకు చెందిన సీరియల్‌ రేపిస్ట్‌ రోనీ షెల్టన్‌ 1980ల్లో అనేక మంది మహిళలపై అత్యాచారం చేశాడు. మొత్తం 49 అత్యాచార కేసులు, 230 ఇతర నేరాలపై అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన కోర్టు రోనీకి 3,195ఏళ్లు కారాగార శిక్ష విధించింది. వీరితోపాటు వివిధ నేరాలు రుజువై 2వేల ఏళ్లు.. వెయ్యి ఏళ్లు.. వందల ఏళ్లు జైలుశిక్ష పడినవారూ ఉన్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని