Crime News: కెమెరా కోసం ఇంత దారుణమా?.. ఫొటోగ్రాఫర్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు

విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్‌ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది.

Updated : 03 Mar 2024 19:12 IST

రావులపాలెం: విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్‌ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌ (23) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌. పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్‌లకూ వెళ్తుంటాడు.

ఈ క్రమంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫొటోషూట్‌ ఉందని ఫోన్‌ చేసి రమ్మన్నారు. దీంతో ఫిబ్రవరి 26న సాయికుమార్‌ తన వద్ద ఉన్న కెమెరా, సామగ్రి తీసుకొని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయిని తీసుకెళ్లారు. పథకం ప్రకారం.. రావులపాలెం సమీపంలోకి వెళ్లిన తర్వాత చంపేశారు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మూడు రోజులు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గత నెల 29న విశాఖలోని పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా కడియంకు చెందిన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కెమెరా కోసమే మూలస్థానం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి సాయిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టినట్టు చెప్పడంతో ఆదివారం వెలికితీశారు. రూ.10 లక్షల విలువైన కెమెరా కోసమే ఫొటోగ్రాఫర్‌ను హత్యచేశారని, అన్ని ఆధారాలు సేకరించి.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని