Suicide: కోట్లలో అప్పులు చేసిన భర్త.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను భర్త క్రికెట్‌ బెట్టింగ్‌లో కోల్పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 26 Mar 2024 18:54 IST

బెంగళూరు: అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను భర్త క్రికెట్‌ బెట్టింగ్‌లో కోల్పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్రదుర్గ ప్రాంతంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దర్శన్‌ 2021 నుంచి టీ20 క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. క్రికెట్‌ మ్యాచ్‌లపై పందేలు కాసేందుకు రూ.1.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. అనంతరం కోటి రూపాయలు తిరిగి చెల్లించాడు. మరో 84 లక్షల రూపాయల రుణం తీర్చాల్సి ఉంది. ఈ సందర్భంగా తరుచూ అప్పుల వాళ్లు తమ డబ్బులు చెల్లించమని గొడవ చేసేవారు. వారి వేధింపులతో విసిగిపోయిన అతని భార్య రంజిత(23) ఆత్మహత్యకు పాల్పడింది. 

వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే  తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో చేర్చాడు. తన అల్లుడికి బెట్టింగ్‌ అంటే ఇష్టం లేదని అప్పు ఇచ్చిన వారే డబ్బు ఆశ చూపి అతనిని బలవంతంగా ఇందులోకి దింపారని వాపోయాడు. మృతురాలి వద్ద పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె వడ్డీ వ్యాపారులు తమను తీవ్రంగా వేధించారని అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు. దర్శన్, రంజితలకు 2020లో వివాహం కాగా  వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని