Bride: గాల్లోకి కాల్పులు జరిపిన వధువు.. ఆ తర్వాత ఏమైందంటే..!

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar pradesh)లో జరిగిన ఓ పెళ్లివేడుకలో వధువు (Bride) గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు ప్రస్తుతం పరారీలో ఉంది.

Published : 10 Apr 2023 17:58 IST

లఖ్‌నవూ: పెళ్లి.. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే సంతోషకరమైన వేడుక. ఈ సందర్భం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే. అయితే, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ (UttarPradesh) లోని హత్రాస్‌ (Hatras)లో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి మండపంలో ఓ వధువు రివాల్వర్‌ (Revolver)తో 5 సెకెన్ల వ్యవధిలో గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు వధువుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

హత్రాస్‌లోని సాలెంపూర్‌లో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుక జరిగింది. వధూవరులిద్దరూ దండలు మార్చుకున్న తర్వాత ఓ వ్యక్తి వేదిక మీదకు వచ్చి.. కొద్దిసేపు నిల్చున్నాడు. ఆ తర్వాత లోడ్‌ చేసి ఉన్న రివాల్వర్‌ను పెళ్లికూతురు చేతికిచ్చాడు. ఆమె నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత రివాల్వర్‌ను మళ్లీ అతడికి ఇచ్చేసింది. ఆ పక్కనే ఉన్న వరుడు మాత్రం బిక్కమొహం వేసుకొని కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గన్‌ ఇచ్చిన వ్యక్తి వధువు తరఫు బంధువై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు తరఫు బంధువులను త్వరలోనే విచారిస్తామని ఏఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

ఉత్తరభారతంలో పెళ్లి సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపడం కొత్తేం కాదు. అయితే, తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో డిసెంబర్‌ 2019లో కేంద్రం ఆయుధ చట్టాన్ని సవరించింది. బహిరంగ సభలు, మతపరమైన స్థలాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో లైసెన్స్‌ ఉన్న తుపాకులు సైతం వాడటం నేరమని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే రెండేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు వేడుకల్లో తుపాకుల వినియోగంపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా..  సమాచారం ఆధారంగా కేసు నమోదు చేయొచ్చని 2016లోనే లఖ్‌నవూ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని