రూ.300 విలువైన ఆభరణాలు రూ.6కోట్లకు.. అమెరికా మహిళకు టోకరా!

అమెరికాకు చెందిన ఓ మహిళను నిట్టనిలువునా ముంచేశాడు జైపుర్‌కు చెందిన వ్యాపారి. కేవలం రూ.300 విలువ చేసే నగల్ని రూ.6 కోట్లకు విక్రయించాడు.

Published : 12 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాణ్యమైన బంగారంతో చేసిన ఆభరణాలంటూ అమెరికాకు చెందిన ఓ మహిళను నమ్మించాడు ఓ నగల వ్యాపారి. మాయ మాటలు చెప్పి వాటిని కొనేలా ప్రేరేపించాడు. అలా కేవలం రూ.300 విలువ చేసే ఆభరణాలను రూ.6 కోట్లకు అంటగట్టాడు. రెండేళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో సదరు మహిళ షాక్‌ అయ్యారు. 

అమెరికాకు చెందిన చెరిష్‌ అనే మహిళ రెండేళ్ల క్రితం జైపుర్‌లోని ఓ నగల దుకాణంలో ఆభరణాన్ని కొనుగోలు చేశారు. వాటి కోసం ఏకంగా రూ.6కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్న ఆభరణాల్ని అమెరికాలోని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో నకిలీవి అని తెలియడంతో ఆమె కంగుతిన్నారు. కొనుగోలు చేసే సమయంలో బంగారం స్వచ్ఛతను చూపించే హాల్‌మార్క్‌ సర్టిఫికెట్‌ ఉండటంతో ఆమెకు ఎటువంటి సందేహమూ రాలేదు. నిజం తెలిసిన వెంటనే ఆ మహిళ జైపుర్‌కి వచ్చి జ్యువెలరీని తనకు విక్రయించిన వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. 

నగల షాపు యజమాని ఆమె మాటల్ని తప్పుబట్టాడు. ఆ మహిళే తన దుకాణంలోని బంగారంతో పారిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించడంతో పాటు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆమె జైపుర్‌ పోలీసులను అభ్యర్థించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ జ్యువెలరీలో పొదిగిన వజ్రాలు నకిలీవని.. 14 క్యారెట్లు ఉండాల్సిన బంగారం కేవలం 2 క్యారెట్లు ఉందని తెలిపారు. నగల వ్యాపారం చేస్తున్న గౌరవ్ సోనీ, రాజేంద్ర సోనీ ఇద్దరినీ నిందితులుగా తేల్చారు. అయితే నకిలీ హాల్‌మార్క్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిద్దరూ కోట్లలో మోసం చేశారంటూ అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని