Gangster Son Encounter: ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నాం కానీ..! ఎన్‌కౌంటర్‌పై కీలక విషయాలు

గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్(Gangster Atiq Ahmed)కుమారుడు అసద్‌.. యూపీ పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు నెలకొన్న పరిస్థితులను పోలీసులు వెల్లడించారు.

Published : 14 Apr 2023 19:01 IST

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్‌ అహ్మద్(Gangster-politician Atiq Ahmed) కుమారుడు అసద్‌, మరో నిందితుడు గులామ్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమవడం సంచలనం సృష్టించింది. అయితే ఎదురుకాల్పులు జరిగిన వెంటనే దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు(Uttar Pradesh police) కీలక విషయాలు వెల్లడించారు. 

‘ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై పారిపోతున్నారని, వారి వాహనాలను ఓవర్‌టేక్ చేయాలని మా డ్రైవర్‌కు సూచించాం. లొంగిపోవాలంటూ నిందితులకు వినిపించేలా గట్టిగా చెప్పాం. కానీ వారు వేగం పెంచి, పారిపోయేందుకే యత్నించారు. ఇంతలో మరో బృందం వారిని చుట్టుముట్టింది. వారు పారిపోయే క్రమంలో జారి కిందపడిపోయారు. ఆ తర్వాత మా సిబ్బందిని దూషించడం ప్రారంభించారు. మాపై కాల్పులు జరిపారు. మా ప్రాణాల గురించి పట్టించుకోకుండా వారిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ వారు ఇష్టారీతిగా కాల్పులు జరపడంతో మేం కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. తర్వాత వారివైపు  నుంచి కాల్పులు ఆగిపోయాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. వారు గాయపడి ఉన్నారు. వారిలో ఇంకా చలనం ఉండటంతో  వెంటనే ఇద్దరిని చెరొక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. కానీ తర్వాత వారు చనిపోయారని తెలిసింది. పిస్తోళ్లు, బుల్లెట్ షెల్స్‌, లైవ్‌ బుల్లెట్లు, ద్విచక్రవాహనాలు సహా మరికొన్ని ఆధారాలను ఘటనా ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నాం’ అని ఎఫ్‌ఐఆర్‌(FIR)లో పోలీసులు తెలిపారు. 

అతీక్‌ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులకు అసద్‌, గులామ్ జాడ తెలిసింది. 2005లో బీస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌(Gangster Atiq Ahmed) ప్రధాన నిందితుడు. ప్రధాన సాక్షి అయిన న్యాయవాది ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యారు. అతీక్‌తో పాటు మరికొందరిపై 2007లో ఉమేశ్‌ కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్‌ ప్రాంతంలోని ఉమేశ్‌ ఇంటి వద్ద ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను దుండగులు కాల్చి చంపారు. అప్పటి నుంచి అసద్‌, గులామ్‌ అదృశ్యమయ్యారు.

అతీక్‌ను తరలిస్తోన్న కాన్వాయ్‌పై దాడికి పన్నాగం..!

మృతులు అసద్‌, గులామ్‌.. గ్యాంగ్‌స్టర్ అతీక్‌( Atiq Ahmed)ను కోర్టుకు తరలిస్తోన్న కాన్వాయ్‌పై దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే  వారి ప్రణాళిక ప్రకారం అతీక్‌ను విడిపించడం వారి లక్ష్యం కాదని చెప్పాయి. ఈ కేసును సంచలనం చేసి,  యూపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసేందుకు కాన్వాయ్‌పై కొన్ని రౌండ్ల కాల్పులు జరపాలని వారు భావించినట్లు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని