Guntur: అర్ధరాత్రి వైద్యదంపతుల్ని నిర్బంధించి.. బెదిరించిన విశాఖ సీపీ సతీమణి

అసలే అయ్యగారి భార్య... ఆమె ఆదేశించారని అర్ధరాత్రి వేళ ఓ ఆసుపత్రిలో వైద్యదంపతుల్ని, వారి ఎనిమిది నెలల చిన్నారిని 2 గంటల వరకూ పోలీసులు నిర్బంధించారు.

Updated : 06 Jun 2024 09:52 IST

గుంటూరు అరండల్‌పేట సీఐతో కలిసి సివిల్‌ పంచాయితీ
ఇచ్చినంత తీసుకుని.. సంతకం పెట్టాలని హెచ్చరిక

ఈనాడు, అమరావతి: అసలే అయ్యగారి భార్య... ఆమె ఆదేశించారని అర్ధరాత్రి వేళ ఓ ఆసుపత్రిలో వైద్యదంపతుల్ని, వారి ఎనిమిది నెలల చిన్నారిని 2 గంటల వరకూ పోలీసులు నిర్బంధించారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా వదల్లేదు. ఆ జంటపై బెదిరింపులకు దిగారు. సివిల్‌ పంచాయితీలో తలదూర్చి పత్రాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అందరూ కౌంటింగ్‌ సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటే గుంటూరు అరండల్‌పేట పోలీసులు మాత్రం అయ్యగారి భార్య తరఫున సివిల్‌ దందా నడిపించారు. ఆ అయ్యగారు విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ కాగా.. పోలీసులతో కలిసి వైద్యదంపతుల్ని నిర్బంధించి, బెదిరించినవారు.. ఆయన సతీమణి డాక్టర్‌ సుమితా శంకర్‌. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

అర్ధరాత్రి వరకూ మహిళను, చిన్నారిని నిర్బంధించడం నేరం కాదా?

ఇద్దరు వ్యాపార భాగస్వాములకు సంబంధించిన సివిల్‌ వివాదంతో అసలు పోలీసులకు ఏం పని? అర్ధరాత్రి వరకూ మహిళను, చిన్నారిని నిర్బంధించడం, బెదిరించడం, సంతకాలు చేయాలని ఒత్తిడి తేవడం ఎందుకు? సివిల్‌ పంచాయితీ చేయడానికి అసలు పోలీసులను అక్కడికి ఎవరు రప్పించారు? రవిశంకర్‌ అయ్యన్నారా? ఆయన సతీమణి సుమితా శంకరా? ఎవరు రప్పిస్తే వాళ్లపైన, వారి ఆదేశాల మేరకు అక్రమ నిర్బంధానికి పాల్పడ్డ అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరెడ్డిపైన ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? పోలీసు అధికారి భార్య అయితే.. ఏం చెబితే అది చేసేస్తారా? వారికి చట్టం వర్తించదా? నీతులు వల్లించే రవిశంకర్‌ అయ్యన్నార్‌ గారూ... ఇది అధికార దుర్వినియోగం కాదా?

భాగస్వాములుగా చేర్చుకుంటానంటూ డబ్బులు తీసుకుని 

సుమితా శంకర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూనే.. గుంటూరు అరండల్‌పేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నడిపిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన డాక్టర్‌ సుమతి, నిరంజన్‌ దంపతుల్ని తన ఆసుపత్రిలో భాగస్వాములుగా చేర్చుకుంటానని చెప్పి ఏడాదిన్నర క్రితం వారినుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో వారితో ప్రాక్టీస్‌ చేయించిన తర్వాత.. వారిని బయటకు పంపారు. తమ సొమ్ము తిరిగివ్వాలని వారు ఎంత కోరినా పట్టించుకోలేదు. పలుమార్లు సంప్రదింపుల అనంతరం చర్చల కోసమంటూ ఆ దంపతులను సోమవారం రాత్రి తన ఆసుపత్రికి పిలిపించి పోలీసులతో కలిసి నిర్బంధించారు. కాగా తమకు జరిగిన అన్యాయంపై బయట మాట్లాడేందుకు కూడా బాధితులు భయపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారి, ఆయన భార్య ఒత్తిడి వల్ల ఏం చెబితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఎవర్నీ బంధించలేదు.. బెదిరించలేదు: డాక్టర్‌ సమితా శంకర్‌

‘‘డాక్టర్‌ నిషాంత్‌ నా ఫొటో పెట్టుకుని తప్పుడు విధానాలతో ప్రాక్టీసు చేశారు. మా పేషెంట్లను లాగేసుకుని నన్ను మోసగించారు. నిషాంత్‌ దంపతులు మా ఆసుపత్రిలో భాగస్వాములుగా చేరి రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆసుపత్రిలో ప్రాక్టీసు చేసినందుకు వారికి ప్రతి నెలా రూ.4 లక్షల చొప్పున చెల్లించాం. వారు ఆసుపత్రిలో ఉండేందుకు గది కేటాయించాం. మొత్తం రూ.50 లక్షల వరకు ఇచ్చా. వారినుంచి పెట్టుబడిగా తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశాం. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ల డేటా చోరీచేశారు. మా పేషెంట్ల ఫోన్‌నంబర్లు తీసుకుని వారితో టచ్‌లో ఉంటూ నా ప్రాక్టీస్‌ దెబ్బతీశారు. డేటా చోరీపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశా. ఎవరినీ బంధించలేదు, బెదిరింపులకు గురిచేయలేదు’’ అని రవిశంకర్‌ అయ్యన్నార్‌ సతీమణి డాక్టర్‌ సుమితా శంకర్‌ చెప్పారు. ఈ అంశంపై రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సంప్రదించగా... ఆయన కూడా ఇవే మాటలు చెప్పారు. అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరరెడ్డి వివరణ కోరేందుకు యత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


రవిశంకర్‌ అయ్యన్నార్‌కు అంతా తెలుసు
- డాక్టర్‌ నిషాంత్, బాధిత వైద్యుడు

‘మేం పెట్టిన పెట్టుబడిలో రూ.12.50 లక్షలు చెల్లిస్తానంటూ సుమితా శంకర్‌ ఆసుపత్రికి పిలిపించారు. తాను ఇచ్చినంత తీసుకోవాలని.. పెట్టాలన్నచోట సంతకం చేసి వెళ్లిపోవాలని బెదిరించారు. అందుకు మేము అంగీకరించలేదు. దీంతో రాత్రి 2గంటల వరకూ మమ్మల్ని ఆసుపత్రిలో బంధించారు. మా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లాగేసుకుంటామని బెదిరించారు. ‘మీపై కేసులు పెట్టి లోపలేస్తా’ అంటూ అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరెడ్డి బెదిరించారు. మేం ఆసుపత్రిలో భాగస్వాములుగా ఉన్న విషయం రవిశంకర్‌ అయ్యన్నార్‌కు తెలుసు. మాకు చెల్లించాల్సిన డబ్బుల గురించీ ఆయనకు తెలుసు. వాటి గురించి అడిగేందుకు.. విశాఖపట్నంలోని ఆయన కార్యాలయానికి వెళ్లగా కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. గత నెలలో ఈ వివాదంపై గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కొందరు అధికారులు పిలిచి వివాదం ఎందుకు ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలని చెప్పారు’.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని