Uttar Pradesh: నీళ్ల కోసం వస్తే.. మహిళను రాడ్లతో కొట్టి చంపారు!

గ్రామంలోని చేతి పంపు ఉపయోగించినందుకు మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేయడంతో.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది. 

Published : 21 Apr 2023 01:45 IST

లఖ్‌నవూ: నీళ్ల కోసం చేతి పంపు (Hand Pump) ఉపయోగించినందుకు మహిళపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని లాల్‌పూర్‌ దేహమాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మర్‌హర పోలీసులు, బాధితురాలి భర్త రింకూ తెలిపిన వివరాల ప్రకారం.. సాధన(40) అనే మహిళ నీళ్ల కోసం గ్రామంలోని చేతి పంపు వద్దకు వచ్చింది. మహిళ చేతి పంపు వినియోగించడం చూసిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఆమెపై ఇనుప రాడ్లతో దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్తపై కూడా నిందితులు దాడి చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనలో మహిళ రెండు కాళ్లు విరిగినట్లు ఆమె భర్త తెలిపారు. దాడి అనంతరం చేతి పంపు ఉపయోగించవద్దని వారు హెచ్చరించినట్లు బాధితురాలి భర్త వెల్లడించారు. తీవ్రగాయాలపాలైన మహిళను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా ఆగ్రాలోని మరో ఆస్పత్రి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన సుధీర్‌ కుమార్‌, సందీప్‌, ప్రేమ్‌పాల్ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో నిందితులు తమ ఇంటికి నిప్పు పెట్టినట్లు ఆమె భర్త  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఏఎస్పీ ధనంజయ్‌ కుస్వాహీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని