Crime News: అరుపులు వినపడకుండా మ్యూజిక్‌ పెట్టి.. మహిళ దారుణ హత్య

ఇంట్లో నగలు కనిపించడం లేదనే నెపంతో ఓ 23ఏళ్ల మహిళపై సమీప బంధువులు అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 22 Jun 2023 01:42 IST

గాజియాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నగలు కనిపించడం లేదనే నెపంతో ఓ 23ఏళ్ల మహిళపై సమీప బంధువులు అతి దారుణంగా దాడి చేశారు. నేరాన్ని అంగీకరించాలని ఒత్తిడి తెస్తూ ఆమెపై బ్లేడు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఆ చిత్రహింసలు భరించలేక ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే, బాధితురాలి అరుపులు బయటకు వినిపించకుండా భారీ మ్యూజిక్‌ శబ్దాలను పెట్టడం గమనార్హం. ఈ అమానుష ఘటన గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌కు చెందిన సమీనా(23) నగరంలోని సిద్ధార్థ్‌ విహార్‌లో ఉండే తన బంధువులైన హీనా, రమేష్‌ల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అయితే, ఆ వేడుకలో 5 లక్షల విలువచేసే బంగారు నగలు కనిపించకుండా పోయాయి. దాంతో బంధువులంతా సమీనానే చోరీకి పాల్పడినట్లు అనుమానించారు. దీంతో నేరాన్ని అంగీకరించాలని ఆమెపై ఒత్తిడితెచ్చారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై బ్లేడ్‌, రాడ్డులతో దాడి చేశారు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు పెద్దగా మ్యూజిక్‌ను పెట్టారు. అలా వాళ్లు పెట్టిన చిత్రహింసలకు ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ, మ్యూజిక్‌ను మాత్రం కట్టివేయలేదు.

ఇలా రెండురోజుల నుంచి ఆ ఇంట్లో నుంచి భారీ మ్యూజిక్‌ వినిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అసలు నిజం బయటపడింది. విగతజీవిగా పడి ఉన్న సమీనాను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చేపట్టామని స్థానిక ఏసీపీ రవికుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని