logo

లైంగిక వేధింపులతోనే బాలిక ఆత్మహత్య

ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పాలిటెక్నిక్‌ విద్యార్థిని (17) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. లైంగిక వేధింపుల కారణంగానే బాధితురాలు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధరించారు.

Updated : 03 Apr 2024 03:47 IST

ల్యాబ్‌ టెక్నీషియన్‌పై పోక్సో కేసు, అరెస్టు
ప్రిన్సిపాల్‌ సహా మరో ముగ్గుôరి అరెస్టు
విశాఖ ఘటన వివరాలు వెల్లడించిన పోలీసులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పాలిటెక్నిక్‌ విద్యార్థిని (17) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. లైంగిక వేధింపుల కారణంగానే బాధితురాలు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధరించారు. ప్రధాన నిందితుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో నలుగురిని అరెస్టు చేశామని డీసీపీ-1 మణికంఠ వెల్లడించారు. ఏసీపీ సునీల్‌తో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ‘అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెంకు చెందిన బాలిక (17) విశాఖపట్నంలోని కొమ్మాది వద్ద చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతోంది. కళాశాలలో కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులకు వాట్సప్‌ సందేశం పంపించింది. అనంతరం వసతిగృహం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విచారణలో కెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఎన్‌.శంకరరావు అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిసింది. ల్యాబ్‌లో తమను కావాలనే తాకడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేసేవాడని పలువురు విద్యార్థినులు వెల్లడించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఘటన జరిగిన రోజున ఉదయం నుంచి విద్యార్థిని కనిపించకపోయినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ రోజు తరగతులకు హాజరు కాకుండా ఆ విద్యార్థిని హాస్టల్‌లోనే ఉండిపోయినా ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వార్డెన్‌ భర్తకు అదే వసతిగృహంలో గదిని సైతం కేటాయించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని యాజమాన్యానికి సంబంధించి శంకర్‌ వర్మ, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.భానుప్రవీణ్‌, వార్డెన్‌ వి.ఉషారాణి, వార్డెన్‌ భర్త వి.ప్రదీప్‌కుమార్‌లను అరెస్టు చేశాం’ అని డీసీపీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని