logo

గులకరాయికి.. రాజకీయ రంగు!

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది.

Updated : 19 Apr 2024 08:17 IST

బొండా ఉమా చుట్టూ కేసు

ప్రాణాలు తీసే కుట్ర ఉందంట
ప్రేరేపించిన వారు ఉన్నారంట
ఈనాడు, అమరావతి

‘రాష్ట్ర ముఖ్యమంత్రి జీవితాన్ని తుద ముట్టించేందుకు (ఎలిమినేట్‌ ద లైఫ్‌) జరిగిన కుట్రలో మరో నిందితుడు (ఏ2)తో కలిసి ఏ1 (వేముల సతీష్‌) చాలా చురుకుగా పాల్గొన్నట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దర్యాప్తు అసంపూర్తిగా జరిగింది.. ఇంకా మరికొందరు సాక్షులను విచారణ చేయాల్సి ఉంది.. మరికొన్ని సాంకేతిక అంశాలను విశ్లేషణ చేయాల్సి ఉంది.’

- సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో విజయవాడ నార్త్‌ డివిజను ఏసీపీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశమిది.

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ప్రాణాలు తీసేందుకు పక్కాగా ముందస్తు ప్రణాళిక రచించారనీ, కుట్ర కోణం ఉందనీ, మరో నిందితుడి ప్రేరణతోనే మొదటి నిందితుడు రాయి గురి పెట్టి.. ప్రాణాలు తీసేందుకు ఆయువు పట్టుపై తగిలేలా కుట్ర చేశారనేది దర్యాప్తు అధికారి నిగ్గుతేల్చిన అంశం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ప్రస్తుతం ఏ1 నిందితుడిగా వేముల సతీష్‌ (19)ను న్యాయస్థానంలో హాజరు పరిచారు. నిందితుడిని మరో నిందితుడు ప్రేరేపించారని ఏ2గా పేర్కొన్నారు. కానీ అతను ఎవరనేది రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనలేదు. ఏ2 నుంచి ఎంత వరకు సంఖ్య వెళుతుందో తెలియదనీ, కుట్ర కోణం ఉందని దర్యాప్తులో తేలడంతో ఎంతమందిని అయినా చేర్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.


రాజకీయ నేపథ్యమేనా..?

కేసు రాజకీయ నేపథ్యంగానే సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా కొందరు స్వామి భక్తిని వదలడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈనెల 13న రాత్రి విజయవాడలో సీఎం జగన్‌ రోడ్‌షోలో ఘటన జరిగింది. దీనిలో సీఎం ప్రాణాలను తీసేందుకు కుట్ర జరిగితే ముందుగా పోలీసులు నిఘా వర్గాలు ఎందుకు తెలుసుకోలేకపోయాయి.? భద్రత ఏమైంది.? అదృష్టవశాత్తు రాయి సున్నితమైన ప్రాంతంలో (ప్రాణం పోయే) తగల్లేదని పోలీసుల వాదనగా ఉంది. అంటే కచ్చితంగా ప్రాణంపోయే ప్రాంతంలో తగిలేలా గురి చూసి రాయితో కొట్టే అవకాశం రోడ్‌షోలో ఉంటుందా..? పక్కన జనాలు, పోలీసుల నిఘా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక సిమెంట్‌ కాంక్రీట్‌ రాయితో ఒక వ్యక్తిపై గురి చూసి కొట్టి ప్రాణం తీయడం సాధ్యమా? అనే సందేహాలు ఉన్నాయి. ‘నిందితుడు తప్పనిసరిగా ప్రొఫెషనల్‌ షూటర్‌ అయి ఉండాలి. మంచి శిక్షణ తీసుకుని ఉండాలి. ఒలింపిక్స్‌ వంటి క్రీడల్లో పాల్గొంటే బంగారు పతకాలు వచ్చి ఉండాలని’ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎందుకు కొట్టాడనేది రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొనలేదు. ప్రేరేపితుడు అయ్యాడు.. మరో వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నారు. అంత సమూహంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ప్రేరేపించిన ఏ2ను గుర్తించలేదు. ఏ2 మరో ప్రేరేపణ ఉండే అవకాశం లేకపోలేదనేదే ప్రధాన అనుమానం.


బొండా ఉమానే లక్ష్యమా?

భూమి గుండ్రంగా ఉన్నట్లు ఈ కేసు తిరిగి తెదేపా నేత బొండా ఉమా చుట్టూ తిరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడిగా ఒక యువకుడిని అరెస్టు చేశారు. ఏ2గా ఒక వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుర్గారావుగా పేరు చెబుతున్నారు. ఆయన తెదేపాలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం ప్రకారం మరో నేతకు గురి పెట్టారు. దీనికి కారణం ఫిర్యాదుదారు సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ కావడమే. ఆయన రాజకీయ ప్రత్యర్థి తెదేపా నుంచి బరిలోకి దిగుతున్న బొండా ఉమా. దీంతో ఆయనను కేసులో ఇరికించేందుకు సీఎంపై రాయి విసిరిన కేసు ఏకంగా కుట్ర కోణంగా ఆయన ప్రాణం తీసే హత్యాయత్నం కేసుగా మారింది.


నందిగామ సంఘటన కాదా..?

2022లో నందిగామలో జరిగిన సంఘటన ఇదే తరహాలో ఉంది. అక్కడ మాజీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విసిరిన రాయి భద్రత అధికారి అప్రమత్తతో చీఫ్‌ సెక్యూరిటీ అధికారి మధుసూదనరావుకు తగిలింది. గురి తప్పడం వల్ల గడ్డం భాగంలో తీవ్ర గాయమైంది. లేకుంటే.. ప్రాణం తీసే కుట్ర కదా. కానీ అక్కడ పోలీసులు ఐపీసీ 324 ప్రకారం కేసు నమోదు చేశారు. తర్వాత కుట్ర కోణం విచారణ లేదు. అక్కడ వైకాపా నాయకుడు అనుమానితుడిగా ఉన్నా.. కనీసం విచారించలేదు. దాదాపు ఏడాదిన్నర అయింది కేసు అతీగతీ లేదు. పురోగతి లేకుండా వదిలేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరిక ఉంది. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంది. అంత ఉన్నా.. నందిగామ కేసు చాలా తేలిగ్గా పోలీసులు తీసుకున్నారు. నాడు సీసీ టీవీలు, ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉన్నా.. ఒక్కటంటే ఒక్కటీ పరిశీలించలేదు. నాడు.. నేడు పోలీసు కమిషనర్‌ కాంతిరాణానే ఉన్నారు. నేడు అయిదు రోజుల్లో బలహీన వర్గాల కుర్రాడిని నిందితుడిని చేసి.. లింకులు వెదుకుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని