logo

డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..

ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

Published : 20 May 2024 03:41 IST

పాడవుతున్న బస్సుల స్థానాన్ని భర్తీ చేయని ఆర్టీసీ
విడిభాగాల కొరతతో అరకొరగానే మరమ్మతులు
రహదారులపై నిత్యం ఆగిపోతున్న బస్సులు..
ఈనాడు అమరావతి

ఆగితే తోయాల్సిందే..

ర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. వీటి నుంచి గుణపాఠాలు నేర్వడం లేదు. అరకొరగానే కొత్త వాటిని కేటాయించి చేతులు దులుపుకొంటున్నారు. ఇంకా రావాల్సినవి కూడా గడువులోగా చేరడం లేదు. అంతిమంగా ప్రయాణికులకు డొక్కు బస్సులే దిక్కవుతున్నాయి. గ్యారేజీల్లో అరకొరగానే మరమ్మతులు చేసి, రూట్‌పైకి పంపిస్తున్నారు. విడిభాగాల అధిక కొరతే కారణం. అద్దె బస్సులకు టెండర్లు పిలుస్తున్నా పెద్దగా స్పందన లేక.. విధి లేని పరిస్థితుల్లో పాత బస్సులనే నడుపుతున్నారు.

తప్పని తిప్పలు

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 15 ఏళ్లు వాడేసిన 120 బస్సులను తొలగించారు. వీటి స్థానంలో వేరే వాహనాలను భర్తీ చేయలేదు. అద్దెకు తీసుకుందామన్నా సిటీ రీజియన్‌లో ఎవరూ రావడం లేదు. దీంతో పక్కన పెట్టాల్సిన వాటి స్థానంలో ఇతర జిల్లాల నుంచి 45 బస్సులు తెచ్చి సర్దుబాటు చేశారు. ఇవి కూడా ఎక్కువ కిలోమీటర్లు తిరిగినవే. వీటి స్థానాల్లో అద్దె బస్సులను పెట్టి, వాటిని నగరానికి తెచ్చారు. గ్రామీణంలో అద్దె బస్సులతో నడిపిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాకు కొత్తగా 12 బస్సులు, కృష్ణా జిల్లాకు 4 బస్సులు మాత్రమే వచ్చాయి. రెండు జిల్లాల్లో చాలా డిపోల్లో 50 బస్సులు మరమ్మతులకు వీల్లేక.. తుక్కు చేసేందుకు ఆదేశాలిచ్చారు. ఇవి 15 ఏళ్లు నిండకపోయినా.. వాటి పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులు జాడ లేక తప్పనిసరై నడుపుతున్నారు. 2024-25లోనూ చాలా బస్సులు స్క్రాప్‌కు పంపాలి.

మొరాయిస్తే.. నరకమే

అన్నీ తూతూమంత్రంగానే..

ఆర్టీసీలో విడిభాగాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తగినన్ని అందుబాటులో లేక తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డెక్కిన బస్సులు గమ్యస్థానం చేరేలోపు పలు చోట్ల ఆగడంతో ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. జాయింట్లు, బ్రేక్‌ డ్రమ్‌లు, బ్రేక్‌ల స్పేర్లు, తదితర వస్తువులు గ్యారేజీల్లో ఉండడం లేదు. దీంతో మెకానిక్‌లు చేసేది లేక మమ అన్పించి వదులుతున్నారు. సీఎన్జీ బస్సులకు స్పేర్ల కొరత తీవ్రంగా ఉంది. పలు బస్సులు 15 ఏళ్లు నిండకపోయినా.. విడిభాగాలు దొరక్క నిలిపేస్తున్నారు. ఇవి గ్యారేజీలకే పరిమితం అవుతున్నాయి. మెకానిక్‌లు కూడా తగిన సంఖ్యలో లేరు. పదవీవిరమణ చేసిన వారి స్థానాలను భర్తీ చేయకనే ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో పొరుగుసేవల సిబ్బందిని అయినా నియమించే వారు. ఇప్పుడు పూర్తిగా గాలికి వదిలేయడంతో ఉన్న అరకొర సిబ్బందిపై అధిక పనిభారం పడుతోంది. మూడు వారాల కిందట ఇబ్రహీంపట్నం - మైలవరం సబర్బన్‌ బస్సు జాయింట్లు ఊడి ఆగిపోయింది. చేసేది లేక.. ప్రయాణికులను వేరే బస్సులోకి ఎక్కించి పంపేశారు. అదే ప్రమాదానికి గురైతే.. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవి.

అద్దె బస్సులూ రావడం లేదు

ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో 24, కృష్ణాలో 16 రూట్లలో అద్దె బస్సులకు టెండర్లు పిలిచారు. దాఖలైన బిడ్లలో కొన్ని రూట్లలో అధికారులు ఖరారు చేశారు. స్పందన లేని మార్గాల్లో వచ్చే దఫా పిలిచే టెండర్లలో కలిపే వీలుంది. ప్రతి దశలోనూ చాలా మార్గాలకు బిడ్లు దాఖలు కావడం లేదు. ఇలా మిగిలిన వాటిని తదుపరి టెండరల్లో ఆహ్వానిస్తున్నారు. బిడ్లు వచ్చిన రూట్లలోనూ పలువురు ఆపరేటర్లు బస్సులు పెట్టడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల్లో రాయితీ ఇస్తుండడంతో పలువురు టెండర్లు వేస్తున్నారు. రుణం విషయానికి వచ్చే సరికి వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. కొన్ని రూట్లలో పోటీ పెరిగి.. తక్కువ ధరకు కోట్‌ చేస్తున్నారు. రుణం కోసం వెళ్లినప్పుడు బ్యాంకరు తిరస్కరిస్తున్నారు. ఫలితంగా అనుకున్న సమయానికి బస్సులు రోడ్డెక్కని పరిస్థితి.

కృష్ణా జిల్లా బస్సుల పరిస్థితి ఇదీ..

(దూరం లక్షల కిలోమీటర్లు - బస్సుల సంఖ్య)

15పైన.. 73
14-15.. 37
13-14.. 13
12-13.. 14
11-12.. 07

మొత్తం బస్సులు .. 277

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని