logo

కుమారుడ్ని క్రికెట్‌ శిక్షణకు తీసుకెళ్తూ తిరిగిరాని లోకాలకు

రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల్ని ప్రయోజకులను చేయాలనే సంకల్పంతో నాగాయలంక మండలం నుంచి విజయవాడకు వచ్చారు.

Published : 22 May 2024 03:35 IST

లారీ ఢీకొనడంతో కొడుకు కళ్ల ముందే తండ్రి దుర్మరణం
విజయవాడ రామవరప్పాడు రోడ్డులో ఘటన

గుణదల, నాగాయలంక, న్యూస్‌టుడే: రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల్ని ప్రయోజకులను చేయాలనే సంకల్పంతో నాగాయలంక మండలం నుంచి విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో కుమారుడ్ని క్రికెట్‌ తర్ఫీదు కేంద్రానికి తీసుకెళ్తున్న తండ్రిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కొడుకు కళ్ల ముందే తండ్రి మరణించిన విషాదకర ఘటన విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామవరప్పాడు రింగ్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెంకు చెందిన మత్తి మురళి(47) మూడేళ్ల కిందట జీవనోపాధి కోసం విజయవాడకు వచ్చారు. రామవరప్పాడు చిన్న వంతెన ప్రాంతంలో నివాసం ఉంటూ తాపీ మేస్త్రీగా పని చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె దేవీప్రసన్న ఇంటరు, కుమారుడు దుర్గాప్రసాద్‌ పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. దుర్గప్రసాద్‌ సిద్దార్థ వైద్య కళాశాల మైదానంలో క్రికెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో తండ్రి మురళీ ద్విచక్రవాహనంపై కుమారిడ్ని స్టేడియానికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. రామవరప్పాడు రింగ్‌ నుంచి ఏలూరు రోడ్డు వైపు వెళ్తుండగా ఎదురుగా బెంజ్‌సర్కిల్‌ నుంచి గన్నవరం వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరు కింద పడిపోగా, మురళీపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ భీతావహదృశ్యాన్ని చూసిన స్థానికులు, బంధువులు చలించిపోయారు. తండ్రి మృతదేహం వద్ద కొడుకు గుండెలు పగిలేలా రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. మురళీ తల్లి రేమాలవారిపాలెంలో నివాసముంటోంది. ఈ ఘటనతో రేమాలవారిపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మాచవరం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గుణరాము తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని