logo

కేంద్రం తీరుతో పెరిగిన నిరుద్యోగం: డీవైఎఫ్‌ఐ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని కేరళకి చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఎ.రహీం ఆరోపించారు.

Published : 26 Mar 2023 04:53 IST

ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యుడు రహీం. చిత్రంలో సంఘం నాయకులు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని కేరళకి చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఎ.రహీం ఆరోపించారు. శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘పెరుగుతున్న నిరుద్యోగం-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా, 14శాతం నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. కరోనా సమయంలో దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయి, యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీలు చదివిన వారు చిన్న చిన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక సుమారు 25వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. నిరుద్యోగం పెరుగుతున్నా.. ప్రధాని మోదీకి, ఇక్కడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పట్టవన్నట్లు వారి వ్యవహార శైలి ఉందన్నారు. నిరుద్యోగం తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాకల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న, నాయకులు ఎన్‌.నాగేశ్వరరావు, కృష్ణ, జయచంద్ర, శివకుమార్‌ బాబు, రాజు, సూర్య, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని